రాష్ట్ర ప్రభుత్వానికి తలంటిన సుప్రీంకోర్టు | supreme court issues contempt notice to kerala government | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వానికి తలంటిన సుప్రీంకోర్టు

Published Fri, May 5 2017 11:31 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

రాష్ట్ర ప్రభుత్వానికి తలంటిన సుప్రీంకోర్టు - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి తలంటిన సుప్రీంకోర్టు

కేరళ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసు కూడా జారీచేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ గట్టిగా ప్రశ్నించింది. సోమవారంలోగా దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పినరయి విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టులో నియమించగా, దానిపై ఆయన కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సేన్‌కుమార్‌ను మళ్లీ డీజీపీగా నియమించాలని చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంకా సేన్‌కుమార్‌ను డీజీపీ చేయకుండా ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూనే ఉంది. దాంతో కొన్నాళ్లు వేచి చూసిన ఆయన.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో తాము చెప్పినా కూడా ఎందుకు ఆయనను డీజీపీ పదవిలో నియమించలేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తీసేసి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. కానీ ఆయన ఆ పదవిలో చేరకుండా కోర్టుకెక్కారు. పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించారని, ఆ కేసులో తప్పు చేసిన పోలీసు అధికారులను సేన్‌కుమార్ కాపాడారని సుప్రీంకోర్టులో కేరళ సర్కారు వాదించింది. కానీ కోర్టు మాత్రం సేన్‌కుమార్‌కు అనుకూలంగానే తీర్పు వెల్లడించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement