న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ పేరుతో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మూడు రోజులపాటు సడలించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ కొనసాగుతూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, మరోవైపు అదే ప్రాంతంలో సడలింపులు ఇవ్వడం ఎంతమాత్రం తగదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తేల్చి చెప్పింది. ఆంక్షల సడలింపు వ్యవహారం ఒకవేళ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలకు దారితీస్తే తాము కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
బక్రీద్ సందర్భంగా కేరళలో కరోనా ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దాఖలైన పిటిషన్‌సై జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ బి.ఆర్.గవాయిల ధర్మాసనం తొలుత సోమవారం విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయాలని కేరళ సర్కారును ఆదేశించింది. దీంతో కేరళ సర్కారు మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులోని అంశాల పట్ల న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. వ్యాపారుల వద్ద సరుకులు మిగిలిపోతాయన్న కారణంతో కరోనా ఆంక్షలను సడలించడం ఏమిటని నిలదీసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతుండగానే కన్వర్ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుప్రీంకోర్టు గత వారం సుమోటోగా విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment