
నలుగురు భర్తలు ఎందుకు ఉండకూడదు?
‘ముస్లిం పర్సనల్ లా’ను మార్చాలన్న కేరళ జడ్జి
కోజికోడ్: ‘ముస్లిం పురుషుడికి నలుగురు భార్యలు ఉండవచ్చని చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు నలుగురు భర్తలు ఉండకూడదు?’ అంటూ కేరళ హైకోర్టు జడ్జి బి.కెమల్ పాషా కోజికోడ్‌లో ఆదివారం జరిగిన ముస్లిం మహిళా సమాఖ్య సభలో ప్రశ్నించారు. అర్థవంత జీవితం గడిపేందుకు పురుషుడికైనా, మహిళకైనా ఒక భాగస్వామి చాలన్నారు. క ట్నం, విడాకులు వంటి అంశాల్లో మహిళలపై ముస్లిం పర్సనల్ లా వివక్ష చూపుతుందని, ఖురాన్ చెపుతున్న దానికి అవి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వాటిని పరిష్కరించడంలో వివక్ష సృష్టించిన మతనేతలు భయపడకూడదని, పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. ముస్లిం మహిళలు విడాకులు పొందేందుకు ఖురాన్‌లోని ‘ఫసఖ్’ హక్కు కల్పిస్తున్నా... ‘లా’ ఆ హక్కు కల్పించడం లేదన్నారు. అన్ని న్యాయసూత్రాలు రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవంగా జీవించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 14, 21కు లోబడి ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత న్యాయం ఖురాన్‌కు అనుగుణంగా లేదని, పర్సనల్ లాలో మార్పులు రావాలన్నారు.