దుబాయ్: గర్భిణీ భార్యను స్వదేశానికి పంపేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళవాసి హఠాన్మరణం చెందిన ఘటన దుబాయ్‌లో వెలుగు చూసింది. దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కేరళ కోజికోడ్‌కు చెందిన నితిన్ చంద్రన్ (28) గుండెపోటుతో చనిపోయాడని స్థానిక మీడియా వెల్లడించింది. అతనికి అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నాయని పేర్కొంది. భార్య భారత్‌కు రావడంతో నితిన్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలో అతను గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశాడని తెలిపింది. ఇక నితిన్ మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యులు చెప్పారు. కాగా, నితిన్ చంద్రన్, గర్భంతో ఉన్న అతని భార్య అథిరా గీత శ్రీధరన్ (27) ఇటీవల వార్తల్లో నిలిచారు.
కరోనా లాక్‌డౌన్‌తో అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వారు భారత సుప్రీం కోర్టు తలుపుతట్టారు. జూలై తొలివారంలో తనకు కాన్పు కావాల్సి ఉందని, భారత్‌కు వెళ్లేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పిటిషన్ వేశారు. అయితే, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ, దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ చొరవ తీసుకున్నారు. వందేభారత్‌లో భాగంగా ఆమెకు మొదటి ప్రాధాన్యమిచ్చి మే 7న భారత్‌కు పంపించారు. దాంతో అతను దుబాయ్‌లోనే ఉండిపోయారు. ఇక నితిన్ మృతి తనను కలచి వేసిందని విపుల్ అన్నారు. దుబాయ్‌లో, కేరళలో సామాజిక కార్యక్రమాల్లో నితిన్ చురుగ్గా ఉండేవాడని అతని మిత్రులు చెప్పారు. రక్తదాన శిబిరాల ఏర్పాటుతో ఎందరి ప్రాణాలో నిలిపాడని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment