అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది
తిరువనంతపురం: మా ప్రొడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఉదరగొట్టే యాడ్లను రోజూ చూస్తూనే ఉంటాం. అవి అన్ని వట్టి మాటలే అనే విషయం మనకూ తెలుసు. కానీ, ఓ యాడ్ను సీరయస్గా తీసుకున్నచాతూ అనే శిల్పి ఏకంగా ఓ సబ్బును సంవత్సరం పాటూ వాడాడు. అయినా అతను ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో విసిగిపోయిన అతను ఏకంగా ఆ యాడ్లో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ, సదరు సంస్థపై 2015 సెప్టెంబర్లో వాయానంద్లోని వినియోగదారుల కోర్టులో కేసు పెట్టాడు.
దీంతో చాతూకు, ఇందులేఖ సంస్థ రూ.30,000లు పరిహారంగా ఇవ్వడానికి అంగీకరించింది. సమాజంలో ఎంతో పలుకుబడి ప్రభావం ఉన్న మమ్మూట్టీ నటించిన ఇందులేఖ సబ్బు యాడ్ను చూసి ఆ సబ్బును వాడానని కానీ, కొంచెం కూడా మార్పు రాలేదని చాతూ తెలిపాడు.
ఇందులేఖ సబ్బు ట్యాగ్లైన్- 'సౌందర్యం నిన్గలే తేడి వరుం' (అందం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది) అనే విషయాన్ని కూడా కోర్టు వాదనల సందర్భంగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది. దీంతో కేసుపై ఏమీ వాదించకుండానే ఆ వ్యక్తికి పరిహారం చెల్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది.