కేరళ నుంచి తమిళనాడు వరకు పరుగో పరుగు
కొచ్చి: అచ్చం సినిమాలో కనిపించే చేజింగ్ లాంటి సీన్.. ఇంకా ఎంత దూరం చేయాలని వెంబడిస్తున్నవారికి చిరాకు. పోని ఎటువైపు వెళుతున్నారో అనే ఆలోచన చేద్దామా అనుకునే లోగానే అంచనాకు అందకుండా దిశమారుతోంది.. అయితే, ఇక్కడ జరిగింది మాత్రం దొంగా-పోలీస్ చేజింగ్ కాదు. మీడియా పోలీసు చేజింగ్.. చేతిలో కెమెరాలతో మీడియా సోదరులు తెగ అలసిపోయారు. కేరళ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు పోలీసు జీపును వెంబడించారు.
ఎందుకని అనుకుంటున్నారా అందులో ఉన్నది కీలక నేరస్తుడు మరి. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి సంబంధించి ఓ కీలక వీడియో పోలీసులకు ఇస్తానని చెప్పడంతో కెమెరా కళ్లని ఆ జీపుపైనే పడ్డాయి. మధ్యాహ్నం 3గంటల ప్రారంభమైన ఆ పరుగు తమిళనాడులోని కోయంబత్తూర్ వైపుగా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాం కేసులో పోలీసులు బిజు రాధాకృష్ణన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్ ముందు గతవారం అతడు హాజరైన సందర్భంలో గురువారం ఒక కీలక వీడియోను అందజేస్తానని చెప్పాడు. ఆ వీడియోలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆయన కేబినెట్ మంత్రులు, తన లివింగ్ పార్ట్నర్ సరితా నాయర్ తో సన్నిహితంగా ఉన్న వీడియో ఉందని చెప్పారు.
అయితే, గురువారం కమిషన్ వద్దకు వచ్చిన బిజు తన వద్ద మొత్తం మూడు వీడియో కాపీలు ఉండగా ఒకటి దేశం వెలుపల ఉందని, మరొకటి తనను 2013లో అరెస్టు చేసినప్పుడు పోలీసులు తీసుకున్నారని, మరొకటి మాత్రం తన స్నేహితుడి వద్ద భద్రంగా ఉందని చెప్పాడు. దీంతో వెంటనే ఆ వీడియోను తీసుకొని రావాల్సిందిగా కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చి తన తరుపున ఇద్దరు అధికారులను ఇచ్చి పంపించింది. దీంతో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అతడిని పోలీసులు జీపులో ఎక్కించుకొని బయలుదేరగానే ఆ వీడియో కోసం మీడియా ప్రతినిధులు కూడా పోలీసులను చేజింగ్ చేశారు.