
నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను చెప్పే నటుడు ప్రకాశ్ రాజ్. దేశంలో నెలకొన్న పరిణామాలపై గొంతు విప్పుతున్న ఆయన తాజాగా కేరళ రాష్ట్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తాను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం ఏదైనా ఉంటే అది కేరళనే అని ఆయన పేర్కొన్నారు. కేరళ అంతర్జాతీయ చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌కే) ప్రారంభోత్సవంలో ప్రకాశ్ రాజ్ ప్రసంగించారు.
'నేను కేరళకు వచ్చినప్పుడు స్కిప్ట్ తీసుకొని రాను. ఎందుకంటే సెన్సార్ భయం ఉండదు. నాకు కేరళ అంటే చాలా ఇష్టం. నేను నిర్భయంగా శ్వాస తీసుకోగలిగే రాష్ట్రం కేరళనే' అని ఆయన అన్నారు. దర్శకుడు సనాల కుమార్ శశిధరన్ తెరకెక్కించిన 'సెక్సీ దుర్గ' సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 'ఎస్ దుర్గ సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులకు 'దుర్గ వైన్‌షాప్, దుర్గ బార్' వంటి పేర్లతో ఎలాంటి అభ్యంతరం లేనట్టు ఉంది. నన్ను బెదిరించే వారిని చూసి నవ్వుతాను. నా నోరు మూయించాలనుకునేవారిని చూసి గట్టిగా పాడుతాను. నా హక్కులను వారు దూరం చేయలేరు' అని చెప్పారు. తనకు ఎలాంటి రాజకీయ సంస్థలతో సంబంధం లేదని, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై గొంతెత్తడం ఒక కళాకారుడిగా తన బాధ్యత అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment