రక్తాభిషేకం చేయనున్న కాళీమాత ఉత్సవానికి సంబంధించిన పోస్టర్, ఆలయం
తిరువనంతపురం : పాలాభిషేకంతోపాటు వివిధ తైలాలతో ఆలయాలకు, అందులోని విగ్రహాలకు అభిషేకం చేయడం విన్నాం. కొన్ని ఆలయాల్లో జంతువులను బలిచ్చి వాటి రక్తంతో అభిషేకం చేయడం చూశాం.. ఇక మనుషుల రక్తంతో అభిషేకం చేయడం మాత్రం సినిమాల్లో మాత్రమే అప్పుడప్పుడు చూశాం. కానీ, విస్మయం చెందేలాగా కేరళలో చేసిన ఓ బహిరంగ ప్రకటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్కడి కాళీమాత ఆలయానికి అభిషేకం చేసేందుకు భారీగా రక్తం కావాలని, అందుకోసం భక్తులు వీలయినంత త్వరగా వారి రక్తాన్ని దానం చేసి పంపిచాలంటూ తిరువనంతపురం జిల్లా పరిధిలోని విధుర అనే గ్రామ ఆలయ అధికారులు బహిరంగంగా ప్రకటన చేశారు. పోస్టర్లు కొట్టించారు. ఈ ఆలయంలో ప్రతియేటా జరిగే ఉత్సవాల్లో భాగంగా రక్తాభిషేకం చేయాల్సి ఉన్నందున భక్తులంతా త్వరగా వారి రక్తాన్ని దానం చేసి ఆలయానికి పంపించాలంటూ అందులో ప్రకటించారు.
అంతేకాదు.. భక్తుల వద్ద నుంచి ప్రభుత్వ ఆమోదంపొందిన వైద్యులే రక్తాన్ని భద్రంగా సేకరిస్తారని కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు. మార్చి పన్నెండున సాయంత్రం 6గంటలకు ఈ ఉత్సవం జరగనుందట. ఆ నోటీసులో పేర్కొన్న ప్రకారం ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలుస్తారు. మొత్తం పద్నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలోని రెండో రోజున కాళీమాతకు రక్తాభిషేకం నిర్వహిస్తారు. ఈ తంతును కాళీయుత్తు మహోత్సవం అని పిలుస్తారు. కాళీమాత ఆకలిని తీర్చే గొప్ప వేడుకగా దీన్ని పేర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment