
అప్ఘన్‌లో కేరళ ఐయస్ ఉగ్రవాది మృతి
కాసర్గోడ్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టుగా భావిస్తున్న కేరళ యువకుడు హఫీసుద్దీన్ అఫ్ఘనిస్తాన్‌లో శనివారం జరిగిన డ్రోన్ దాడిలో చనిపోయాడు. హఫీసుద్దీన్ బందువు రెహమాన్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు.
అఫ్ఘనిస్థాన్‌లో ఉన్న అష్పాక్ అనే మరో బందువు ఫేస్‌బుక్ ద్వారా ఈ సమాచారాన్ని తమకు తెలియజేశాడని చెప్పాడు. అక్కడే అతని అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు, జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఏ)కు తెలియజేశానని రెహమాన్ చెప్పాడు. కేరళకు చెందిన 21 మంది యువకులు ఐఎస్‌లో చేరారు. గతేడాది జూలైలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ అసెంబ్లీలో ఈ విషయం చెప్పారు. కాసర్‌గాడ్ జిల్లా నుంచి 17 మంది, పలక్కాడ్ నుంచి నలుగురు వెళ్లారని వెల్లడించారు.