బిర్యానీలో కూడా! | Kolkata Civic Body On a Mission to Crack Down Synthetic Colour in Biryani | Sakshi
Sakshi News home page

బిర్యానీలో కూడా!

Published Wed, Jun 15 2016 4:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

బిర్యానీలో కూడా!

బిర్యానీలో కూడా!

కోల్ కతా: బ్రెడ్ తయారీలో రసాయనాల మోతాదు ఎక్కువగా ఉంటున్నాయని, వాటివల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిన్న మొన్నటి వరకు గగ్గోలు పుట్టింది. ఆ విషయాన్ని మరువక ముందే ప్రజలందరూ బాగా ఇష్టపడే బిర్యానీలో కూడా రసాయనాలు కలుపుతున్నట్లు తేలింది. దీనిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సత్వర విచారణకు ఆదేశించింది. బిర్యానీ తయారీలో సింథటిక్ రసాయనాలను వాడుతున్నట్లు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎమ్ సీ) అధికారులు నిర్ధారించారు.

నగరంలో వివిధ రెస్టారెంట్లు, హోటళ్లలో సేకరించిన బిర్యానీలపై నిర్వహించిన పరీక్షల్లో అత్యధిక శాతం కేన్సర్ కారకంగా భావించే మెటానిల్ ఎల్లో అనే పదార్థం ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. బిర్యానీలో బియ్యం పసుపు రంగులోకి మారడానికి సాధారణంగా కుంకుమపువ్వును ఉపయోగిస్తారని కానీ, యజమానులు మెటానిల్ ఎల్లో అనే రసాయనం వాడుతున్నట్లు గుర్తించామని వివరించారు. దీన్ని సాధారణంగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వుతో పోలిస్తే మెటానిల్ ఎల్లో ధర తక్కువ కావడం వల్లే రోడ్డు మీద అమ్మే వారి నుంచి హోటళ్ల వరకు దానిని ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఫుడ్ టెక్నాలజీ నిపుణులు తెలిపారు.

కాగా, బ్రెడ్, బన్, పావ్ బాజీ, పిజ్జా తదితర బేకరీ ఐటమ్స్‌లో రసాయనాలను అధికమోతాదులో ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలడం ఇప్పటికే కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. తాజాగా బిర్యానీల్లో కూడా రసాయనాల వినియోగిస్తుండటంతో రాష్ట్ర ఆహార సంస్థకు ఈ విషయమై నివేదికను పంపింది. రసాయనాలు కలిపిన బిర్యానీని తయారుచేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను న్యాయసలహాలను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement