ఆగిన కృష్ణమ్మ పరుగులు
- వట్టిపోయిన జీవనది
- దాహంతో అల్లాడుతున్న గ్రామీణులు
- విద్యుత్ ఉత్పత్తికి గండం
రాయచూరు రూరల్ : ఎప్పుడు నీటి పరవళ్లతో తొణికసలాడే కృష్ణమ్మ ఈ ఏడాది రాయచూరు జిల్లాలో వెలవెలపోతోంది. దీంతో నదీ ప్రాంత పరిధిలో నీటి ఎద్దడి ఉధృత రూపం దాల్చుతోంది. మరో వైపు కృష్ణా నీటిపై ఆధారపడి విద్యుత్ ఉత్పతి చేసే రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రానికి గండం పొంచి ఉంది. బెల్గాం జిల్లాలో ఐనాపూర్ వద్ద కర్ణాటకలోకి అడుగు పెట్టే కృష్ణమ్మ 482 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రాయచూరు జిల్లా దేవరసుగూర్ ప్రాంతంలో వీడ్కోలు పలికి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
ఈ ఏడాది ఎలోనిన్ కారణంగా వర్షాభావం ఏర్పడి కృష్ణమ్మలో నీటి జాడలు కనుమరగు అవుతున్నాయి. దీంతో రాయచూరు జిల్లాలో నదీ తీరంలోని పట్టణాలు, గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడి పోతున్నారు. మరో వైపు పశువులు సైతం దాహంతో అలమటించి పోతున్నాయి. ఆ ప్రాంతంలో సంచరించే వన్య మృగాలు కూడా కనుమరుగవుతున్నాయి.
కృష్ణమ్మలో నీటి జాడలు లేక ఈ నదిపై ఆధారపడి నిర్మించిన ఆర్‌టీపీఎస్‌లోని ఎనిమిది యూనిట్లు ఆగిపోయే ప్రమాదం నెలకొంది. ఆర్‌టీపీఎస్ నడవాలంటే రోజు ఒక లక్ష క్యూబెక్ నీరు అవసరం. రాష్ట్రానికి రోజూ 182 దశలక్ష యూనిట్ల విద్యుత్ అవసరం కాగా ఆర్టీపీఎస్ నుంచి 35 దశలక్ష యూనిట్లు అందుతుంది. అయితే నది ఎండిపోతుండటంతో ఆర్టీపీఎస్‌కు చీకటి ఆవరించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడి రాష్ర్టం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.