సెంగార్‌కు జీవిత ఖైదు | Kuldeep Singh Sengar gets life imprisonment in Unnao case | Sakshi
Sakshi News home page

సెంగార్‌కు జీవిత ఖైదు

Published Sat, Dec 21 2019 3:33 AM | Last Updated on Sat, Dec 21 2019 3:33 AM

Kuldeep Singh Sengar gets life imprisonment in Unnao case - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సెంగార్‌ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మేశ్‌ శర్మ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్‌ను ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు.

నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్‌ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడిపై కాస్త కరుణ చూపాలన్న సెంగార్‌ తరఫు లాయర్‌ వాదనలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూ సెంగార్‌ ప్రజల విశ్వాసాలను దెబ్బ తీశారని, ఈ కేసు తీవ్రతను తగ్గించి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందని, అందుకే వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీబీఐని ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ఢిల్లీ మహిళా కమిషన్‌ పర్యవేక్షణలో ఏడాదిపాటు అద్దె ఇంట్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నెలకు రూ.15 వేల అద్దెను యూపీ సర్కారే భరించాలని స్పష్టం చేశారు.

బాధితురాలి సాక్ష్యానికి మించింది లేదు: న్యాయమూర్తి
సమాజంలో పలుకుబడి కలిగి, శక్తిమంతమైన ఒక వ్యక్తిపై బాధితురాలు చెప్పిన మాటలకు మించిన సాక్ష్యం మరేదీ ఉండదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చెప్పారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఆమె కూడా సెంగార్‌ బాధితురాలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తీర్పు వెలువరించిన సమయంలో దోషి సెంగార్‌ కోర్టు హాలులోనే ఉన్నారు. న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఆయన ఒక్కసారిగా భోరుమని విలపించారు. తన కుమార్తె, సోదరిని పట్టుకొని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మైనర్‌లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఉరి శిక్ష విధించాల్సింది : బాధితురాలి సోదరి
బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌కు ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని బాధితురాలి సోదరి అన్నారు. అప్పుడే తమ జీవితాలు భద్రంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు.  ‘సెంగార్‌కు ఉరిశిక్ష విధిస్తే మాకు న్యాయం జరిగేది. అతను జైల్లో ఉన్నప్పటికీ అనుక్షణం భయపడ్డాం. సెంగార్‌ జైలు నుంచి బయటకు వస్తే మమ్మల్ని బతకనివ్వడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. నేరం జరిగిన సమాయానికి పోక్సో సవరణలు చేపట్టలేదు. దీంతో సెంగార్‌ మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు.

కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, కస్టడీ డెత్‌..
ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్‌ 2017 జూన్‌ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్‌ అనుచరులు ఆమెను కిడ్నాప్‌ చేసి గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించు కోలేదు.  2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది.  దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది.  అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్‌ను సీబీఐ అరెస్ట్‌ చేíసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement