సాక్షి, న్యూఢిల్లీ : షరియత్ చట్టాలు కఠినంగా అమలయ్యే అరబిక్ దేశం కువైట్‌లో క్షమాభిక్ష అరుదైన మాట. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుంచి క్షమాభిక్షను ప్రసాదించడం సంచలనంగా మారింది. మరణశిక్షలను జీవితఖైదుగా మారుస్తూ కువైత్ రాజు జాబర్ అల్ సబా ఉత్తర్వులు జారీచేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం వెల్లడించారు.
15 మంది మరణశిక్షలను జీవితఖైదుగా మార్చడంతోపాటు మరో 119 మంది భారతీయ ఖైదీల శిక్షాకాలాన్ని కూడా తగ్గించారని సుష్మా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అభ్యర్థనను దయతో అంగీకరించిన కువైత్ రాజుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.సాక్షి వెబ్
కువైత్ రాజు తాజా ఉత్తర్వుల ప్రకారం జైళ్ల నుంచి విడుదలకానున్న భారతీయ ఖైదీల విషయంలో స్థానిక అధికారులకు అక్కడి భారత రాయబార కార్యాలయం పూర్తిగా సహకరిస్తుందని సుష్మా చెప్పారు. సాక్షి
కువైట్‌లో స్మగ్లింగ్, హత్యా నేరాల కింద శిక్షలు పడిన భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే, శిక్ష తగ్గిన ఖైదీల జాబితాలో తెలుగువారు ఉన్నారా, లేదా అనేది తెలియాల్సిఉంది.