అవునా.. మా వాళ్లు భారత్‌లోకి వచ్చారా!: చైనా
షాంఘై: లడఖ్‌లో తమ దేశ సైనికులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన విషయం తమకు తెలియదని చైనా పేర్కొంది. భారత స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన సైనికులు లడఖ్‌లోని పన్గాంగ్ సరస్సు వద్ద చొరబాటుకు యత్నించగా భారత సైనికులు వారిని అడ్డుకున్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.
పన్గాంగ్ సరస్సు వద్ద చొరబాటుకు యత్నించడంతో పాటు అడ్డుకున్న భారత జవానులపై పీఎల్‌ఏ సైనికులు రాళ్లు రువ్వినట్లు భారత్ ఆరోపించింది. దాంతో భారత సైనికులు కూడా చైనా జవానులకు దీటుగా బదులివ్వాల్సివచ్చిందని వెల్లడించింది. ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన గొడవలో కొందరికి చిన్నపాటి గాయాలైనట్లు పేర్కొంది.
కాగా, ఈ విషయంపై చైనా తొలుత మౌనం వహించి, ఇప్పుడు తాపీగా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యుంగ్.. తనకు ఈ విషయం గురించి అసలు సమాచారమే లేదని పేర్కొన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఏసీ) వద్ద పీఎల్‌ఏ సైనికులు నిరంతరం పహారా కాస్తారని చెప్పారు. చైనా-భారత్ సరిహద్దులో శాంతిభద్రతలకు చైనా కట్టుబడి ఉందని తెలిపారు. భారత్ తరఫు సైన్యం ఎల్‌ఏసీ నిబంధనలను పాటించాలని సూచించారు.