ఇతని పేరు లలితా సాల్వే. వయస్సు 28 ఏళ్లు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్‌కు చెందిన వాడు. 2010 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో విశేషం ఏముంది అంటే.. అసలు విషయమంతా అక్కడే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఘనత ఇతనిదే. ఇంతకీ అతను ఏం చేశాడు? ఎందుకు అతని విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకుంది?
ఫొటో చూస్తే తెలుస్తోంది కదా లలితా సాల్వే పురుషుడని.. కానీ అక్కడే మిస్టరీ ఉంది. నిజానికి అతను పురుషుడు కాదు...అక్షరాలా మహిళే! కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరింది కూడా మహిళగానే. అయితే చిన్నప్పటినుంచీ లలితా సాల్వే.. ఆమెనా.. అతడా అన్నది పెద్ద కన్‌ఫ్యూజన్. శరీరమేకాదు.. హావభావాలు, ప్రవర్తన, అంతా డిఫరెంట్. డాక్టర్లకు కూడా పెద్ద పజిల్. చివరికి ఎన్నో టెస్ట్‌ల తర్వాత వైద్యులు అసలు విషయం తేల్చేశారు. లలితా సాల్వేలో స్త్రీ లక్షణాల కంటే పురుష లక్షణాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు.
పురుషులకు ఉండాల్సిన అంగాలు వున్నప్పటికీ.. అవి సంపూర్ణం కావాలంటే 'సెక్స్ రీ-అసైన్‌మెంట్ సర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్)’ చేయాలని తేల్చారు. నిజానికి స్త్రీగా కంటే పురుషుడిగా వుండాలనే కోరిక లలితా సాల్వేలో మొదటినుంచీ బలంగా వుండేది. డాక్టర్లు కూడా సర్జరీ చేయించుకుంటే పురుషుడిగా మారిపోవచ్చని గ్యారంటీ ఇచ్చారు. దీంతో సర్జరీ చేయించుకోవడానికి ఒక నెల రోజులు సెలవు కావాలంటూ మహారాష్ట్ర పోలీసు అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకుంది. అప్పటిదాకా తమ కానిస్టేబుల్ మహిళ అనుకున్న పోలీసులకు ఒక్కసారి షాక్ తగిలింది. అధికారులు కూడా ఏం చేయాలిరా బాబూ అని తలపట్టుకున్నారు. కుదరదంటూ ఆమెకు తేల్చిచెప్పారు. ఇక లాభం లేదనుకున్న లలిత ఏకంగా ముంబై హైకోర్టు మెట్లు ఎక్కింది. తాము తేల్చలేమని నేరుగా రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. విషయం కాస్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాకా వెళ్లింది. ఒకవైపు లలితకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఆయన చివరికి ఓకే చెప్పేశారు. లలిత విషయంలో పాజిటివ్‌గా స్పందించాలంటూ హోంశాఖను ఆదేశించారు. అలా..అలా చివరికి పురుషుడుగా మారేందుకు లలితకు లైన్ క్లియర్ అయింది. సెలవు మంజూరైంది. ఇప్పుడు లలిత ఎంతో హ్యాపీ. ఒకటి రెండు రోజుల్లో జేజే ఆస్పత్రిలో ఆమె సర్జరీ చేయించుకోబోతున్నారు. ఆమె నుంచి అతడిలా ఈ కథ ఇలా సుఖాంతమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment