సాక్షి, రాంచీ : గడ్డి కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సా ముండ జైలులో ఖైదీగా ఉన్నారు. లాలూ యాదవ్‌కు జైలులో ఖైదీనెంబర్ 3351, వీఐపీ గదిని కేటాయించారు. లాలూకి రాత్రి రోటీ, పాలక్ కర్రీని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం లాలూకు టీ, బిస్కెట్లు అందించినట్లు వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆదివారం నాడు లాలూని కలిసిందుకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు.
వీఐపీ గది.. రాజభోగాలు
బిర్సా ముండల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూప్రసాద్ యాదవ్‌కు జైలు అధికారులు వీఐపీ జైలు గదిని కేటాయించారు. ఈ గదిలో ఆటాచ్ బాత్రూమ్‌తో పాటు, కేబుల్ కనెక్షన్ ఉన్న టీవీ సెట్, అవసరమైన మందులు, దోమతెర, దిండు, కుర్తా - ఫైజామా జత బట్టలు, చలిని తట్టుకునేందుకు అనువైన బ్లాంకెట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. జైల్లో ఆయనే స్వంతంగా ఆహారాన్ని వండుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.
నిద్రలేని రాత్రి
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో జైలు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి జైలు పక్షిలా మారారు. జైలులో లాలూకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినా.. రాత్రంతా జైలులో నిద్రపోలేదని అధికారులు చెబుతున్నారు. అటూఇటూ తిరుగుతూ, దీర్ఘంగా ఆలోచిస్తూ.. రాత్రిని గడిపారని చెబుతున్నారు. ఉదయాన్నే జైలు గదిని బయటకు వచ్చిన లాలూ.. కూరగాయలు తోటను పరిశీలించి.. అక్కడే మార్నింగ్ వాక్ చేశారని జైలు అధికారులు చెబుతున్నారు.
హైకోర్టులో సవాలు చేస్తా:
సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తానని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. భారతీయ జనతాపార్టీ తనపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నా చివరి శ్వాస వరకూ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నీచ రాజకీయాలకు దిగుతోందని లాలూ యాదవ్ ఆరోపించారు.
బెయిల్ కష్టమే
ఇదిలా ఉండగా.. లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో మూడు కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు బెయిల్ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment