ఫ్యామిలీ ప్యాకేజి మొదలైపోయింది!
బిహార్‌లో ఒకప్పటి బద్ధశత్రువైన జేడీ(యూ)తో చేతులు కలిపిన తర్వాత అధికారం చేపట్టిన ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్.. తన ఫ్యామిలీ ప్యాకేజి ప్రారంభించేశారు. స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేని లాలు.. తన ఇద్దరు కొడుకులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడమే కాక, వాళ్లలో తేజస్వి యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన భార్య రబ్రీదేవికి కూడా మరో పదవిని కట్టబెట్టేశారు. బిహార్ శాసన మండలిలో రాష్ట్రీయ జనతాదళ్ పక్ష నేతగా ఆమె పేరును ఖరారు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తేజస్వి యాదవ్‌కే ఆర్జేడీ శాసన సభా పక్ష నేత పదవి కూడా కట్టబెట్టారు.
గతంలో బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్యాకేజి కింద మొత్తం పదవులలో సింహభాగాన్ని తన కుటుంబ సభ్యులకే కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ అధికారాన్ని పంచుకోవడమే కాక.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కూడా అవతరించడంతో తమవంతు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ పదవులను లాక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పదవులలో కూడా తన సొంత మనుషులు (ఫ్యామిలీ) తప్ప బయటివాళ్లు లేకుండా లాలు జాగ్రత్త పడుతున్నారు.