సాక్షి, పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు కొనసాగుతున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను కేంద్రం ఉపసంహరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ఆయనకు ఎన్ఎస్జీ కమెండోలు గార్డులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాలూకు ఉన్న జెడ్‌ప్లస్ క్యాటగిరీ నుంచి జెడ్‌కు కుదించింది. పలువురు ప్రముఖులకు ప్రస్తుతం అందజేస్తున్న భద్రత సదుపాయాలపై కేంద్ర హోంశాఖ ఇటీవలే సమీక్షించిన విషయం విదితమే. కాగా జెడ్‌ప్లస్ భద్రతలో ఎన్‌ఎస్‌జీ కమాండోలు రక్షణగా ఉంటారు. ఇకపై లాలూకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. దీని ప్రకారం ఆయనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలు రక్షణ ఉంటుంది.
మరోవైపు లాలూకు భద్రత కుదింపుపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ స్పందించారు. ఒకవేళ తన తండ్రికి ఏమైనా జరిగితే అందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
కాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితేన్ రామ్ మాంఝీకి ప్రస్తుతం ఉన్న జెడ్ క్యాటగిరీ భద్రతను పూర్తిగా తొలగించారు. కేంద్రమంత్రి హరిభాయ్ పి. చౌదరికి ప్రస్తుతం ఉన్న జెడ్ క్యాటగిరి భద్రతను వైప్లస్‌కు కుదించారు. దీని ప్రకారం భద్రత సిబ్బంది సంఖ్య తగ్గుతుంది. ఇంతకుముందు ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన సమయంలో జెడ్ క్యాటగిరీలో భారీగా రక్షణ సిబ్బందిని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment