హీరోలు అనుకుంటున్నారు కొడుకులు! | special story about star kids and political leader kids harrasements | Sakshi
Sakshi News home page

హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!

Published Fri, Aug 11 2017 11:52 PM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!

హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!

అమ్మాయిని బస్సులో ముట్టుకుంటేనే
భయంతో ఆ అమ్మాయి మళ్లీ బస్సెక్కడానికి
కొన్ని రోజులు పడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని
మనమే ఒక మాట అనం. ఈ దరిద్రులు.. ఆమె ప్రయాణిస్తున్న ప్రతిచోటా
వెంబడిస్తూనే ఉన్నారు! ఛేజ్‌ చేస్తూనే ఉన్నారు!
బస్సు కొంత నయం... నలుగురూ ఉంటారు.
ఒంటరిగా టూ వీలర్‌ మీదో, కారులోనో వెళుతూ
అమ్మాయి కనిపిస్తే ఇక ఈ నీచులకు అడ్డూ ఆపూ ఉంటుందా?
‘ఇది తప్పురా’ అని.. ఇంట్లో వాళ్ల అమ్మ చెప్పదా?
లేక.. ‘ఆంబోతులా తిరుగురా’ అని వాళ్ల నాన్న చెప్పాడా?
కొవ్వుతో కలిగిన బలుపుతో కలిసిన
ఈ మదాంధుల్ని చెప్పుతో కొడితే లాభం లేదు.
చట్టమే వీళ్లను తన చెప్పుచేతల్లోకి తీసుకుని
కొత్త మార్గంలో నడిపించేలా చేయాలి.
సినిమాలు చూసో.. వాళ్ల నాయన పలుకుబడిని చూసో..
హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!!


వీరేందర్‌ సింగ్‌ కుందు, ఐ.ఎ.ఎస్‌.
రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి టూరిజం డిపార్ట్‌మెంట్‌ – హర్యానా

ఐ.ఎ.ఎస్‌.లు ఎవరూ సాధారణంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖలు రాయరు. కానీ వీరేందర్‌ సింగ్‌ కుందు 2017 ఆగస్టు 6 ఆదివారం ఫేస్‌బుక్‌లో ఒక లేఖను పోస్ట్‌ చేశారు! అయితే ఆ లేఖను ఆయన ఒక ఐ.ఎ.ఎస్‌. అధికారిగా రాయలేదు. ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా రాశారు.  

‘నిన్న అర్ధరాత్రి నా కూతురు వర్ణికకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది. డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి వస్తుండగా, ఇద్దరు గూండాలు టాటా సఫారీలో ఆమెను వెంబడించారు. నా కూతురు గుండె నిబ్బరంతో వారి నుంచి వేగంగా తప్పించుకుని, కారును వేగంగా డ్రైవ్‌ చూస్తూనే పోలీసులకు ఫోన్‌ చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు ఆమె దారిని పదే పదే అడ్డగించారు. కొన్ని కిలోమీటర్ల్ల దూరం వరకు అలా చేశారు. ఒకచోటైతే వాళ్లలో ఒకడు టాటా సఫారీలోంచి దూకేసి, నా కూతురి కారులోకి దూరే ప్రయత్నం చేశాడు. ఈ లోపు పోలీస్‌లు రావడంతో వారు పారిపోయారు. మా అమ్మాయి ధైర్యంగా అయితే తప్పించుకోగలిగింది కానీ, ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఇద్దరు కూతుళ్ల తండ్రిగా నేనీ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇదంతా మీకు చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి.

ఒకటి : ఇదీ వాస్తవంగా జరిగింది అని చెప్పడం. రెండు.. ఒకవేళ అవసరమైతే మద్దతు కూడగట్టుకోవడం కోసం. ఈ పోరాటాన్ని నేను ఆపదలచుకోలేదు. దోషులకు శిక్ష పడకపోతే ఇంకా ఎంతోమంది కూతుళ్లకు ఈ దుస్థితి రావచ్చు. వాళ్లందరూ నా కూతురంత అదృష్టవంతులు కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. నేను నిలబడుతున్నాను. నిలబడగలిగినంత కాలం నిలబడతాను.’
ఇదీ వీరేందర్‌ సింగ్‌ కుందు రాసిన లేఖ. సోషల్‌ మీడియాలో ఈ లేఖ చదివిన వాళ్లంతా ఆ గూండాలపై విరుచుకు పడ్డారు. కానీ రణవీర్‌ భట్టీ అనే వ్యక్తి మాత్రం వీరేందర్‌ సింగ్‌ మీద విరుచుకు పడ్డాడు! రణవీర్‌ భట్టి హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు!

‘‘అసలు అంత రాత్రప్పుడు ఆ పిల్లకు రోడ్ల మీద ఏం పని?’’ అన్నది రణవీర్‌ భట్టీ ప్రశ్న.
ఆయన ప్రశ్నకు సమాధానం కాదు కానీ.. వర్ణిక.. డిస్క్‌ జాకీ. ఆ వేళప్పుడే ఆమె డ్యూటీ అయిపోతుంది. రోజూ ఆ వేళప్పుడే ఆమె తన కారులో ఇంటికి బయల్దేరుతుంది. ఆమె రోజూ వెళ్లొచ్చే రోడ్డు ఒకటే. కానీ ఆ గూండాల కారణంగా ఆ రోజు రాత్రి ఆమె రోడ్లన్నిటి మీదా పరుగులు తీయాల్సి వచ్చింది.. వాళ్ల నుంచి ఎస్కేప్‌ అవడానికి.

ఆ రోజు వర్ణికను కిడ్నాప్‌ చేసేందుకు వేట కుక్కల్లా వెంటపడిన ఆ ఇద్దరు ఆగంతకులలో ఒకడు వికాస్‌ బరాలా. హర్యానా బీజేపీ చీఫ్‌ సుభాష్‌ బరాలా కొడుకు. ఇంకొడు వికాస్‌ స్నేహితుడు అశీష్‌ కుమార్‌. మొదట వికాస్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు వి.ఐ.పి. కొడుకని తెలిసి వదిలేశారు. తర్వాత వర్ణిక, ఆమె తండ్రి ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం, మీడియా ఒత్తిడి తేవడంతో వికాస్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ వెంటనే వికాస్‌ తండ్రి పార్టీలో తన పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం వర్ణిక కేసు విచారణ జరుగుతోంది. ఈ  సందర్భంగా.. గతంలో విఐపీ పుత్రరత్నాలు  చేసిన కొన్ని ఘనకార్యాలను ఒకసారి చూద్దాం.

మార్చి 2016
సుశీల్‌ కుమార్‌ సన్నాఫ్‌ రావెల కిషోర్‌

సుశీల్‌ మంత్రిగారి అబ్బాయి. నాన్నగారు సోషల్‌ వెల్ఫేర్‌ మినిస్టర్‌. బంజారా హిల్స్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళా టీచర్‌ను సుశీల్‌ కారులో వెంబడించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నలుగురూ గుమికూడారు. పోలీసులు బాధితురాలి కంప్లైంట్‌ తీసుకున్నారు. సుశీల్‌పై ఐ.పి.సి. సెక్షన్‌ 354 మోలెస్టేషన్‌ కేసును నమోదు చేశారు.

జూన్‌ 2015
రితురాజ్‌ సన్నాఫ్‌ ప్రణతి ఫుకాన్‌

ప్రణతి ఫుకాన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే. చేనేత, జౌళి ఉత్పతులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి. ఆమె ఉండడం అస్సాంలో. తనయుడు రితురాజ్‌ ఉండడం బెంగళూరులో. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో బిజినెస్‌ చేస్తున్నాడు. పదేళ్ల బాలికను రేప్‌ చేసి, ఆ చిన్నారి మరణానికి కారణం అయ్యాడన్న ఫిర్యాదుపై సంజయ్‌ నగర్‌ పోలీసులు రితురాజ్‌పై కేసు ఫైల్‌ చేశారు. బాలిక తల్లి వీళ్ల దగ్గరే ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పని చేస్తుంటుంది. అయితే విషయాన్ని పై అధికారులు బైటకు పొక్కనీయలేదు. మంత్రి గారి కొడుకును, అతడి స్నేహితులను తప్పించే ప్రయత్నాలు జరిగాయి.  

జూలై 2014
సురేశ్‌ బదానా సన్నాఫ్‌ హేమ్‌సింగ్‌ బదానా

హేమ్‌సింగ్‌ రాజస్థాన్‌ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన సుపుత్రుడు సురేశ్‌ అల్వార్‌లోని షాలిమార్‌ కాలనీలోకి.. కోళ్ల గంపలోకి దూరిన పిల్లిలా.. దూరాడు. ఒక యువతిని అసభ్యంగా కామెంట్‌ చేశాడు. నలుగురూ పట్టుకుని తన్నబోతే కాలనీలోని 308 క్వార్టర్‌లోకి దూరి తలుపేసుకున్నాడు. అది నాన్నగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టరే. ఎవరొచ్చి తలుపు తట్టినా తియ్యలేదు. అర్ధరాత్రెప్పుడో బాల్కనీ లోంచి గోడ దూకి తప్పించుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

జూన్‌ 2013
ఆదర్శ్‌ సన్నాఫ్‌ జోస్‌ తెట్టాయిల్‌

అప్పటికి లె ట్టాయిల్‌ కేరళ అపోజిషన్‌ లీడర్‌. ఎల్‌.డి.ఎఫ్‌. పార్టీ నాయకుడు. అంతకు ముందు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గం అంగమల్లి. అక్కడి ఓ యువతి ఈ తండ్రీ కొడుకులిద్దరూ తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టింది. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు. నా వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోంది’ అని తప్పించుకోబోయాడు. విశేషం ఏంటంటే.. ఈ కేసులో తండ్రే ప్రధాన నిందితుడు. కొడుకు రెండో నిందితుడు.

జూలై 2011
రోహిత్‌ సన్నాఫ్‌ అటనేషియో మాన్సెరెట్‌

మాన్సెరెట్‌ గోవా విద్యాశాఖ మంత్రి. గోవాలో ఉంటున్న ఒక జర్మన్‌ మైనర్‌ బాలికను రేప్‌ చేసిన కేసులో 2008 నవంబరులో రోహిత్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెజేస్‌లు కూడా అతడు పంపించినట్లు రూడీ అయింది. అయితే మాన్సెరెట్‌ తన పలుకుబడితో కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కేసు నాలుగేళ్లు నడిచింది. చివరికి కోర్టు రోహిత్‌ను నిర్దోషిగా వదిలిపెట్టింది.

జనవరి 2008
తేజస్వీ, తేజ్‌ ప్రతాప్‌.. సన్స్‌ ఆఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. న్యూ ఇయర్‌ వేడుకల్లో ఆయన ఇద్దరు కుమారులు కన్నూమిన్నూ కానకుండా అమ్మాయిల్నీ వేధించారు. గుర్తు తెలియని యువకులు వారికి దేహశుద్ధి చేశారు. ఈ తోపులాటలో తేజస్వి, తేజ్‌ ప్రతాప్‌ల గన్‌మెన్‌ తుపాకీని ఎవరో లాక్కున్నారు. దానిపై కంప్లైంట్‌ ఇవ్వడానికి వెళ్లినప్పుడు వీళ్ల భాగోతం అంతా బయటపడింది. ముందు అశోకా హోటల్‌ దగ్గర కొందరు ఆడపిల్లల్ని ఏడిపించారు. తర్వాత కన్నాట్‌ ప్లేస్‌లో టీజ్‌ చేశారు. ఢిల్లీ–హర్యానా బార్డర్‌లోని ఛతార్‌పూర్‌లో పార్టీ ఉంటే, అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మెహ్రాలీ దగ్గర ఫామ్‌ హౌస్‌ దగ్గర అమ్మాయిల మీద చెయ్యి వేశారు. అదిగో అప్పుడే ఇద్దర్నీ పట్టుకుని లోకల్‌ హీరోలు కొట్టేశారు. ముఖాలు వాచిపోయాయి. ప్రథమ చికిత్స కోసం అన్నదమ్ముల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లమీద కేసు మాత్రం నమోదు కాలేదు! ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్న ఈ ఇద్దరు ప్రబుద్ధులు అమ్మాయిల్ని ఏడిపించడం ఏమిటో!

డిసెంబర్‌ 2007
మిస్టర్‌ ‘హూ?’ గ్రాండ్‌ సన్‌ ఆఫ్‌ ఎ సీనియర్‌ లీడర్‌

దేశంలోని మిగతా కేసుల్లోనైనా ప్రబుద్ధులెవరో, వారి సుపుత్రులెవరో పేర్లు తెలిశాయి కానీ, పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఆయేషా హత్య కేసులో దోషులెవరో ఇంతవరకు తేల్లేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ కి ఇవ్వాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయేషా హత్యను చేసింది ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ మనవడు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సత్యంబాబు అనే యువకుడిని హంతకుడిగా నిర్థారించి, పదేళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా ఈ ఏడాదే విడుదల చేశారు. ఇన్నేళ్లలోనూ అసలు నేరస్థుడు దొరకలేదంటే.. వెనుక వీఐపీల ప్రెజర్‌ ఉన్నట్లేనని అనుకోవాల్సి వస్తోంది.
 


లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వి.ఐ.పి.ల పుత్రరత్నాలు తమ తండ్రుల పలుకుబడితో కేసుల నుండి, శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఈ ధోరణి వల్ల సగటు బాధితురాలు న్యాయం కోసం పోరాడే మానసిక స్థయిర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement