
లాలూ కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ బిహార్ ప్రభుత్వంలో మంత్రులే అయినా.. వాళ్లు వివిధ వివాదాల్లో చిక్కుకొని గత నెల రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, పాతికేళ్ల నాటి పశుదాణా కుంభకోణం కేసుల్లో కుట్రపూరిత ఆరోపణలపై విచారణను కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం లాలూ ప్రసాద్‌కు శరాఘాతమే.
బిహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు 1990 నుంచి 1997 మధ్య వెయ్యి కోట్ల రూపాయల పశుదాణా కుంభకోణం జరిగింది. ఇందులో అధికారులతో పాటు నాటి ముఖ్యమంత్రి లాలూకు ప్రమేయం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో పలువురు అధికారులకు శిక్ష పడినా లాలూకు శిక్ష పడలేదు. 2014లో జార్ఖండ్ హైకోర్టు ఆయనపై దాఖలైన కుట్రపూరిత ఆరోపణలను కూడా కొట్టేసింది. ఇప్పుడు ఆ ఆరోపణలపై విచారణ చేపట్టి 9 నెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లాలూ ప్రసాద్, నేరస్థుడైన రాజకీయ నాయకుడు మహమ్మద్ షాబుద్దీన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల టేపును కొత్తగా ప్రారంభమైన న్యూస్ చానల్ ‘రిపబ్లిక్ టీవీ’ ప్రసారం చేసింది. షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేస్తుంటే వాటిని శిరసావహిస్తానని లాలూ చెప్పడం ఆ సంభాషణల సారాంశం.
బిహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న లాలూ కుమారులు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, అంటే 2004 నుంచి 2009 మధ్య అనుమానాస్పద భూ ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పట్నాలో ఈ అన్నాదమ్ములకు ఓ పెట్రోలుబంకు ఉన్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం వారిపై వచ్చిన మరో వివాదం. లాలూ, ఆయన కుమారులకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేయడంలో పట్నా జంతు ప్రదర్శనశాల సరైన బిడ్డింగ్ ప్రక్రియను పాటించలేదన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేయడం మరోటి. లాలూ, ఆయన కుమారులపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ విచారణయోగ్యమైనవి అనడంలో సందేహం లేదు. ఒకే సమయంలో ఇవన్ని కూడా వెలుగులోకి రావడం, బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడం వెనకనున్న రాజకీయం ఏమిటన్నదే ఇక్కడ ప్రశ్న. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అటు ఢిల్లీలో లాలూ కుటుంబాన్ని ఎండగడుతుండగా, బీజేపీ మరో సీనియర్ నాయకుడు సుశీల్ మోడీ బిహార్‌లో ఎండగడుతున్నారు. నితీష్–లూలూ సంకీర్ణ ప్రభుత్వాన్ని విడగొట్టడమే ఇక్కడ బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. లాలూకు చెందిన ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుంటే ప్రభుత్వానికి అవసరమైన మద్దతును తామిస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే నితీష్ కుమార్‌కు స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 243 సీట్లలో జేడీయుకు 79 సీట్లు, ఆర్జేడీకి 80 సీట్లు ఉండగా, బీజేపీకి 53 సీట్లున్నాయి. ఈ లెక్కన ఆర్జేడీని బయటకు పంపించినా బీజేపీ మద్దతుతో నితీష్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. అదే జరిగితే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా కేంద్రంలో ఎదగాలనుకున్న నితీష్ కల కూడా కలగానే మిగిలిపోతుంది. కాదని, లాలూ పార్టీతోనే కొనసాగితే, లాలూ తనయులు దోషులుగా తేలితే తన ప్రభుత్వం పరువు పోతుంది. ఈ మీమాంసలో ప్రస్తుతం నితీష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.