
పెద్దోడి కన్నా చిన్నోడే బెటర్!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి, తేజ్‌ప్రతాప్ యాదవ్ నితీశ్‌కుమార్ కేబినెట్‌లో టాప్ రెండు, మూడు స్థానాలను అలంకరించడం.. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పెద్దగా అనుభవంలేని వారికి కీలక శాఖలు అప్పగించడంపై విమర్శకులు మండిపడ్డారు. ఇప్పుడు వారు పదవుల్లోకి చేరి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో వయస్సులో చిన్నవాడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన తేజస్వి తన పనితీరుతో ఆకట్టుకుంటుండగా.. అన్న తేజ్‌ప్రతాప్ మాత్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి చేపట్టిన తేజస్వి పరిణతి గల రాజకీయ నాయకుడి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్టు కనిపిస్తుంది.
అదే అన్న తేజ్‌ప్రతాప్ విషయానికొస్తే ఆయనకు 'పాస్' మార్కులు ఇవ్వడానికి ఇప్పటికీ పరిశీలకులు వెనుకాముందాడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తేజ్‌ప్రతాప్ ఇంకా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన కొంత సిగ్గుపడుతూ, నెర్వస్‌కు గురవుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే తేజ్‌ప్రతాప్ కూడా అధికారులతో దృఢంగా వ్యవహరిస్తూ.. శాఖను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.
'తేజస్వి శాంతస్వభావం కనబరుస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన వివిధ రాజకీయ అంశాలపై సమర్థంగా మాట్లాడి.. విమర్శకుల నోళ్లు మూయించారు. లాలూ రాజకీయ వారసుడు తేజస్వినేనని ప్రతిపక్ష నేతలు సైతం ఇప్పుడు అంగీకరిస్తున్నారు' అని ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనోజ్ యాదవ్ పేర్కొన్నారు.