
గోవా సీఎంగా పర్సేకర్ ప్రమాణస్వీకారం
గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపికైన విషయాన్ని తొలుత బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. గోవా ముఖ్యమంత్రి రేసులో ఒకవైపు పర్సేకర్, మరోవైపు ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే అధిష్ఠానం మాత్రం పర్సేకర్వైపే మొగ్గుచూపింది. మనోహర్ పారిక్కర్ కేంద్ర మంత్రిగా వెళ్తుండటంతో ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా పర్సేకర్ను ఎంపిక చేశారు. పర్సేకర్ పేరును పాత ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ ప్రతిపాదించగా, ఉపముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా బలపరిచారు. కాగా కొత్త మంత్రివర్గంలో కూడా డిసౌజా ఉప ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు.
ఎంఎస్సీ, బీఈడీ చదివి, గోవా రాష్ట్ర ఆరోగ్య, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న లక్ష్మీకాంత్ పర్సేకర్ ముందునుంచి బీజేపీలోనే ఉన్నారు. 1956 జూలై 4వ తేదీన యశ్వంత్ పర్సేకర్, చంద్రభాగ పర్సేకర్ దంపతులకు ఈయన జన్మించారు. గోవాలోని మాండ్రెం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో గోవాలో బీజేపీ విజయకేతనం ఎగరేసిన తర్వాత ఈయన మంత్రిపదవి చేపట్టారు. రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్కు ఈయన అత్యంత విశ్వాసపాత్రుడన్న పేరుంది.