నేర చరిత నేతల బ్యాన్‌పై సుప్రీంలో వాదనలు
నేర చరిత నేతల బ్యాన్‌పై నేడు వాదనలు
Published Thu, Aug 31 2017 8:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా జీవిత కాలం నిషేధం విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ నేత అశ్వని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం పై బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది.
ఏదైనా నేరంలో ఛార్జ్‌షీట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన నేతల(ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు)పై ఆరేళ్ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ నిబంధనను శాశ్వత నిషేధంగా మార్చాలంటూ బీజేపీ నేత అశ్వని పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా, ఇదే పిటిషన్ గత వాదనల సందర్భంగా శిక్ష అనుభవించిన నేతల విషయంలో స్పష్టమైన విధానాలు లేకుండా అవలంభిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ పై సుప్రీం సీరియస్ అయ్యింది.
అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత, వయో పరిమితి విధించాలంటూ ఈసీతోపాటు కేంద్రానికి కూడా అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం ఏస్తూనే.. వారిపై జీవిత కాల నిషేధానికి మాత్రం ఎన్నికల సంఘం వెనకంజ వేయటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా ఆర్టికల్ 14 ప్రకారం నేరచరిత నేతలపై బ్యాన్ సబబు కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది.
Advertisement
Advertisement