Lifetime ban
-
నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
షరీఫ్‌పై జీవితకాల నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్తోపాటుగా పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం ఓ చట్టసభ్యుడిపై ఎంతకాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. ఉన్నత న్యాయస్థానం ద్వారా ఒకసారి అనర్హత వేటు పడితే ప్రజాప్రతినిధిగా పోటీ చేయలేరని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 62 ప్రకారం.. ఎంపీ నిజాయితీగా, నీతిమంతుడిగా ఉండాలి. అయితే పనామా పేపర్స్ కేసులో ఈ చట్టం ప్రకారమే షరీఫ్‌ను పాక్ సుప్రీంకోర్టు ఎంపీగా అనర్హుడిగా (జూలై 28, 2017న) ప్రకటించింది. దీంతో షరీఫ్ రాజీనామా చేశారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడిగా కూడా నవాజ్ ఉండకూడదని కోర్టు ఆదేశించింది. -
ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు
సాక్షి,న్యూఢిల్లీ: దోషులుగా తేలిన రాజకీయ నేతలను తమ జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. దోషులపై జీవితకాల నిషేధం అమలైతే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ వంటి నేతలకు చుక్కెదురవుతుంది. ప్రస్తుత చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష ఎదుర్కొనే రాజకీయ నేతలు విడుదలైనప్పటి నుంచి ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. దోషులగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఈసీ వాదిస్తోంది. ఈ ఏడాది జులైలో దీనిపై వాదనల సందర్భంగా ఈసీ సందిగ్థ వైఖరి తీసుకుంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం ఈసీ పరిధిలోనే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈసీ ఈ మేరకు స్పష్టమైన వైఖరితో కోర్టు ముందుకువచ్చింది. దోషులుగా తేలి శిక్షకు గురైన రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న అంశంపై ఈసీ మౌనంవీడి తన వైఖరిని తేల్చిచెప్పాలని జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన సుప్రీం బెంచ్ కోరింది. -
నేర చరిత నేతల బ్యాన్పై సుప్రీంలో వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా జీవిత కాలం నిషేధం విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ నేత అశ్వని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం పై బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. ఏదైనా నేరంలో ఛార్జ్‌షీట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన నేతల(ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు)పై ఆరేళ్ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ నిబంధనను శాశ్వత నిషేధంగా మార్చాలంటూ బీజేపీ నేత అశ్వని పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా, ఇదే పిటిషన్ గత వాదనల సందర్భంగా శిక్ష అనుభవించిన నేతల విషయంలో స్పష్టమైన విధానాలు లేకుండా అవలంభిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ పై సుప్రీం సీరియస్ అయ్యింది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత, వయో పరిమితి విధించాలంటూ ఈసీతోపాటు కేంద్రానికి కూడా అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం ఏస్తూనే.. వారిపై జీవిత కాల నిషేధానికి మాత్రం ఎన్నికల సంఘం వెనకంజ వేయటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా ఆర్టికల్ 14 ప్రకారం నేరచరిత నేతలపై బ్యాన్ సబబు కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. -
క్రికెటర్ శ్రీశాంత్ కు భారీ ఊరట
కొచ్చి:తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్ పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ సోమవారం కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు శ్రీశాంత్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తుది తీర్పును హైకోర్టు వెలువరించింది. దానిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే మే నెలలో బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కోర్టు ఎత్తివేస్తున్నట్లు తాజా తీర్పు ద్వారా ప్రకటించింది. గతంలో కోర్టు చెప్పినా.. ఫిక్సింగ్ వ్యవహారంలో తనకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని, దాంతో తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధం తొలగించాలని శ్రీశాంత్ కేరళ హైకోర్టును కోరాడు. తాను నిర్దోషిగా తేలినా , బీసీసీఐ కావాలనే నిషేధాన్ని కొనసాగిస్తుందని కోర్టుకు పిటిషన్ లో విన్నవించాడు. దానిపై స్పందించిన కోర్టు.. శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐకి నోటీసులు పంపింది. అయితే బీసీసీఐ మాత్రం తన వైఖరిని మార్చుకోకుండా అతనిపై నిషేధాన్ని యథావిధిగా కొనసాగించింది. అతనిపై తాము తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని కూడా బీసీసీఐ పెద్దలు తేల్చిచెప్పారు. ఆ క్రమంలోనే శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయారో చెప్పాలంటూ బీసీసీఐకి కోర్టు మరోసారి నోటీసులు పంపింది. ఆపై ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు.. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తుది ఆదేశాలు జారీ చేసింది. గాడ్ ఈజ్ గ్రేట్.. కేరళ హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ హర్షం వ్యక్తం చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అని ట్విట్టర్ లో పేర్కొన్న శ్రీశాంత్.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. God is great..thanks for the all the love and support pic.twitter.com/THyjfbBSFv — Sreesanth (@sreesanth36) 7 August 2017 -
శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయండి
బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసు న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న పేస్ బౌలర్ ఎస్.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు సాంత్వన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీస్ పంపింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత నెల 16న శ్రీశాంత్ లీగల్ నోటీస్ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. అయితే స్కాటిష్ క్లబ్ తరఫున లీగ్ క్రికెట్ ఆడేందుకు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్ కోర్టుకెక్కాడు. -
శ్రీశాంత్‌కు బీసీసీఐ అనుమతి నిరాకరణ
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ పునరాగమన ఆశలపై బీసీసీఐ నీళ్లు జల్లింది. స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడాలని చూస్తున్న ఈ కేరళ స్పీడ్‌స్టర్‌కు నిరభ్యంతర పత్రం మంజూరు చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని, అందుకే అతడిపై జీవితకాల నిషేధం విధించామని బోర్డుకు చెందిన అధికారి తెలిపారు. 2015లో ఢిల్లీ కోర్టు నుంచి అతడికి క్లీన్చిట్ లభించినా నిషేధం ఎత్తివేసే విషయంలో తుది నిర్ణయం బీసీసీఐకే ఉంటుందన్నారు. -
నాకు ‘గాడ్‌ఫాదర్’ లేడు
⇒ అందుకే నిషేధం పడింది ⇒ ఇప్పటికీ చెబుతున్నా... నేను తప్పు చేయలేదు ⇒ శ్రీశాంత్ ఇంటర్వ్యూ ముంబై: భారత క్రికెట్లో తనకెవరూ గాడ్‌ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే తన మాట ఎవరూ వినలేదని, కేవలం ఐదు నిమిషాల్లోనే బోర్డుపెద్దలు తన తలరాతని నిర్ణయించారని వాపోతున్న శ్రీశాంత్ ఇంటర్వ్యూ... బీసీసీఐ మీకు అన్యాయం చేసిందని అనుకుంటున్నారా? అది అన్యాయం కంటే ఎక్కువ. అయినా నేను దాని గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే నా కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. నాకు ఎక్కువ మందిని శత్రువులుగా చేసుకునే ఉద్దేశం లేదు. ఒకటి మాత్రం స్పష్టం, నేను తప్పు చేసినట్లు కోర్టు చెప్పలేదు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా గురించి, నా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే కోర్టులో తేలిపోతుంది. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారుల ముందు కేసును ఉంచినప్పుడు నీకు సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదా? వాళ్లు నా మాటలు సరిగ్గా వినకుండానే ఐదు నిమిషాల్లో నా తలరాతను నిర్ణయించారు. ఈ సంఘటనల గురించి బీసీసీఐ చూసుకుంటుందని, విచారణ నుంచి నన్ను బయటపడేలా చేస్తానని బీసీసీఐ నాకు తెలిపిందని నేను అధికారులతో చెప్పాను. తర్వాత నేను కిందికి వచ్చి నా కార్లో కూర్చున్నాను. అప్పుడే మీడియా నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. నాపై జీవితకాలం నిషేధం విధించారని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాను. నాకు క్రికెట్లో గాడ్‌ఫాదర్ లేడు. అందుకే ఈ స్థితి. నా జీవితంలో సాధించింది మొత్తం దేవుడి దయవల్లే సాధ్యమైంది. కేవలం అప్పటి పరిస్థితుల ఆధారంగా నన్ను నిందితుడిగా పేర్కొన్నారు. నాపై సూటిగా ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పటి వరకు ఏవీ నిరూపణ కాలేదు. బీసీసీఐ మొత్తాన్ని మార్చాలని సుప్రీంకోర్టు సూచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మీరు మళ్లీ ఆడగలరని ఆశిస్తున్నారా? అవును. నేను జాతీయ జట్టుకే ఆడాలని ఆశించడం లేదు. కేరళ రాష్ట్ర జట్టు, ఫస్ట్ క్లాస్, కౌంటీల్లో ఎక్కడైనా సరే నన్ను ఆడేందుకు అనుమతించాలని కోరుకుంటున్నా. నేను క్రికెట్‌ను చాలా ఇష్టపడతాను. కాస్త సమయం తీసుకున్నా అన్నీ బయటపడతాయి. అందుకోసం నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నా క్రికెట్ కెరీర్‌ను తిరిగి కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా వయసు 31-32 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలను. గత రెండు సంవత్సరాలు ఎంత కష్టంగా గడిచాయి? నా శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. ఈ రెండేళ్లు కేవలం అవమానాలు మాత్రమే ఎదురయ్యాయి. అన్నింటికంటే ఎక్కువ బాధాకరమైన విషయం... మా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఉన్న కొచ్చి మైదానంలోకి వెళ్లలేకపోవడం. అందుకు ప్రతిరోజు బాధపడతాను. సుప్రీం కోర్టు విచారణను గమనిస్తున్నారా? అవును. ఏదైనా గొప్ప నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నాను. నా కేసు విషయానికొస్తే ఒక విషయం మాత్రం స్పష్టం.. కోర్టులో నేను ప్రధాన నిందితుడిగా లేను. సహ నిందితుడిగా మాత్రమే ఉన్నాను. నాపై ఎటువంటి చార్జ్‌షీట్ లేదు. నా తరఫు న్యాయవాదులు జనవరి 13న వాదించనున్నారు. నేను నిర్ధోషిగా బయటపడతానని భావిస్తున్నాను. అంటే మీపై నిషేధం విధించాక ఎటువంటి మంచి జరగలేదంటారా? అలాంటిదేమీ లేదు. త్వరలో నేను తండ్రిని కాబోతున్నాను.