నాకు ‘గాడ్‌ఫాదర్’ లేడు
⇒ అందుకే నిషేధం పడింది
⇒ ఇప్పటికీ చెబుతున్నా... నేను తప్పు చేయలేదు
⇒ శ్రీశాంత్ ఇంటర్వ్యూ
ముంబై: భారత క్రికెట్‌లో తనకెవరూ గాడ్‌ఫాదర్ లేడని అందుకే జీవితకాల నిషేధం అనుభవిస్తున్నానని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే తన మాట ఎవరూ వినలేదని, కేవలం ఐదు నిమిషాల్లోనే బోర్డుపెద్దలు తన తలరాతని నిర్ణయించారని వాపోతున్న శ్రీశాంత్ ఇంటర్వ్యూ...
బీసీసీఐ మీకు అన్యాయం చేసిందని అనుకుంటున్నారా?
అది అన్యాయం కంటే ఎక్కువ. అయినా నేను దాని గురించి మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే నా కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. నాకు ఎక్కువ మందిని శత్రువులుగా చేసుకునే ఉద్దేశం లేదు. ఒకటి మాత్రం స్పష్టం, నేను తప్పు చేసినట్లు కోర్టు చెప్పలేదు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా గురించి, నా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే కోర్టులో తేలిపోతుంది.
బీసీసీఐ అవినీతి నిరోధక అధికారుల ముందు కేసును ఉంచినప్పుడు నీకు సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదా?
వాళ్లు నా మాటలు సరిగ్గా వినకుండానే ఐదు నిమిషాల్లో నా తలరాతను నిర్ణయించారు. ఈ సంఘటనల గురించి బీసీసీఐ చూసుకుంటుందని, విచారణ నుంచి నన్ను బయటపడేలా చేస్తానని బీసీసీఐ నాకు తెలిపిందని నేను అధికారులతో చెప్పాను. తర్వాత నేను కిందికి వచ్చి నా కార్లో కూర్చున్నాను. అప్పుడే మీడియా నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. నాపై జీవితకాలం నిషేధం విధించారని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాను. నాకు క్రికెట్‌లో గాడ్‌ఫాదర్ లేడు. అందుకే ఈ స్థితి. నా జీవితంలో సాధించింది మొత్తం దేవుడి దయవల్లే సాధ్యమైంది. కేవలం అప్పటి పరిస్థితుల ఆధారంగా నన్ను నిందితుడిగా పేర్కొన్నారు. నాపై సూటిగా ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పటి వరకు ఏవీ నిరూపణ కాలేదు.
బీసీసీఐ మొత్తాన్ని మార్చాలని సుప్రీంకోర్టు సూచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మీరు మళ్లీ ఆడగలరని ఆశిస్తున్నారా?
అవును. నేను జాతీయ జట్టుకే ఆడాలని ఆశించడం లేదు. కేరళ రాష్ట్ర జట్టు, ఫస్ట్ క్లాస్, కౌంటీల్లో ఎక్కడైనా సరే నన్ను ఆడేందుకు అనుమతించాలని కోరుకుంటున్నా. నేను క్రికెట్‌ను చాలా ఇష్టపడతాను. కాస్త సమయం తీసుకున్నా అన్నీ బయటపడతాయి. అందుకోసం నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నా క్రికెట్ కెరీర్‌ను తిరిగి కోరుకుంటున్నాను. ప్రస్తుతం నా వయసు 31-32 ఏళ్లు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలను.
గత రెండు సంవత్సరాలు ఎంత కష్టంగా గడిచాయి?
నా శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు. ఈ రెండేళ్లు కేవలం అవమానాలు మాత్రమే ఎదురయ్యాయి. అన్నింటికంటే ఎక్కువ బాధాకరమైన విషయం... మా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ఉన్న కొచ్చి మైదానంలోకి వెళ్లలేకపోవడం. అందుకు ప్రతిరోజు బాధపడతాను.
సుప్రీం కోర్టు విచారణను గమనిస్తున్నారా?
అవును. ఏదైనా గొప్ప నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నాను. నా కేసు విషయానికొస్తే ఒక విషయం మాత్రం స్పష్టం.. కోర్టులో నేను ప్రధాన నిందితుడిగా లేను. సహ నిందితుడిగా మాత్రమే ఉన్నాను. నాపై ఎటువంటి చార్జ్‌షీట్ లేదు. నా తరఫు న్యాయవాదులు జనవరి 13న వాదించనున్నారు. నేను నిర్ధోషిగా బయటపడతానని భావిస్తున్నాను.
అంటే మీపై నిషేధం విధించాక ఎటువంటి మంచి జరగలేదంటారా?
అలాంటిదేమీ లేదు. త్వరలో నేను తండ్రిని కాబోతున్నాను.