క్రికెటర్ శ్రీశాంత్ కు భారీ ఊరట
కొచ్చి:తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్ పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ సోమవారం కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు శ్రీశాంత్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తుది తీర్పును హైకోర్టు వెలువరించింది. దానిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. ఆ క్రమంలోనే మే నెలలో బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కోర్టు ఎత్తివేస్తున్నట్లు తాజా తీర్పు ద్వారా ప్రకటించింది.
గతంలో కోర్టు చెప్పినా..
ఫిక్సింగ్ వ్యవహారంలో తనకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని, దాంతో తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధం తొలగించాలని శ్రీశాంత్ కేరళ హైకోర్టును కోరాడు. తాను నిర్దోషిగా తేలినా , బీసీసీఐ కావాలనే నిషేధాన్ని కొనసాగిస్తుందని కోర్టుకు పిటిషన్ లో విన్నవించాడు. దానిపై స్పందించిన కోర్టు.. శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐకి నోటీసులు పంపింది. అయితే బీసీసీఐ మాత్రం తన వైఖరిని మార్చుకోకుండా అతనిపై నిషేధాన్ని యథావిధిగా కొనసాగించింది. అతనిపై తాము తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని కూడా బీసీసీఐ పెద్దలు తేల్చిచెప్పారు. ఆ క్రమంలోనే శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయారో చెప్పాలంటూ బీసీసీఐకి కోర్టు మరోసారి నోటీసులు పంపింది. ఆపై ఈ కేసును పలుమార్లు విచారించిన కోర్టు.. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తుది ఆదేశాలు జారీ చేసింది.
గాడ్ ఈజ్ గ్రేట్..
కేరళ హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ హర్షం వ్యక్తం చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అని ట్విట్టర్ లో పేర్కొన్న శ్రీశాంత్.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు.
God is great..thanks for the all the love and support pic.twitter.com/THyjfbBSFv
— Sreesanth (@sreesanth36) 7 August 2017