
పిడుగులు ఎంతదూరం ప్రయాణిస్తాయో తెలుసా ?
ఈ విశ్వంలో సెకనుకు 100 పిడుగులు చొప్పున నేలను తాకుతున్నాయి. పిడుగుల తాకిడికి ఏటా కనీసం వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక చెట్లు, జంతువులకైతే లెక్కేలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పిడుగుల వల్ల అడవుల్లో ఏటా సుమారు పదివేలకు పైగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నట్లు అంచనా. ముందుగా ఏ ఎండుటాకులనో, ఎండుకొమ్మలనో, ఎండుగడ్డినో తాకిన పిడుగులు క్షణంలో వాటిని అంటించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక్కోసారి ఈ పిడుగుపాట్ల వల్ల పెద్ద ఎత్తున అడవులకు, వన్యప్రాణులకు నష్టం కలుగుతోంది.
పిడుగులు మబ్బులు ఉండే ప్రాంతంలో అడ్డంగానూ, మబ్బుల నుంచి భూమి వైపునకు నిలువుగానూ రెండు విధాలుగా ప్రయాణిస్తాయి. నిలువుగా ప్రయాణించే పిడుగులు 5-10 మైళ్ల దూరం ప్రయాణిస్తే, అడ్డంగా ప్రయాణించేవి మాత్రం 60 మైళ్లు ఇంకా అంతకన్నా ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలుగుతాయి. కొన్నేళ్ల కిందట అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో సంభవించిన పిడుగు 118 మైళ్ల దూరం ప్రయాణించింది. మానవ సమాజానికి తెలిసినంత వరకూ ఇప్పటి దాకా ఇదే అత్యంత దూరం ప్రయాణించిన పిడుగుగా నమోదయ్యింది.