నెక్ట్స్ టార్గెట్.. వీళ్లే..!?
సాక్షి, కశ్మీర్ : కొంత కాలంగా కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు చాలా దూకుడు మీదున్నాయి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు.. నియంత్రణ రేఖ దాటుతున్న మిలిటెంట్లను ఎక్కడిక్కడ భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. తాజాగా అమర్‌నాథ్ యాత్రీకులపై దాడికి వ్యూహరచన చేసిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్‌ను రెండు రోజుల కిందట శ్రీనగర్‌లో భద్రతా బలగాలు కాల్చి చంపాయి. తాజాగా.. జమ్మూ కశ్మీర్‌లో హింసను ప్రోత్సహిస్తున్న టాప్-5 మిలిటెంట్ల జాబితాను భద్రతా బలగాలు విడుదల చేశాయి. మా నెక్ట్స్ టార్గెట్ వీళ్లేనంటూ చెప్పకనే చెప్పాయి.
జాకిర్ ముసా :
కశ్మీర్ లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకిర్ ముసా. ఇతను ఆల్‌ఖైదా కశ్మీర్ విభాగానికి అధిపతి. మొదట్లో హిజ్బుల్ ముజాహిదిన్‌లో పనిచేశాడు. ఇతన్ని ఎన్‌కౌంటర్ చేస్తే.. టెర్రరిస్టుల రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి.
రియజ్ నాయికొ:
రియాజ్ ప్రస్తుతం హిజ్బుల్ ముజాహిదీన్ కొత్త చీఫ్. భద్రతా బలగాలు, సరిహద్దు సైనికులు ఇతని కోసం డేగ కళ్లతో చాలా కాలంగా వెతుకుతున్నాయి. హిజ్బుల్ టెర్రరిస్టులను ఆపరేట్ చేస్తూ.. లోయలో ఎక్కడెక్కడ అల్లర్లు చేయాలో డిసైడ్ చేస్తుంటాడు. ఇతనికి లోయలోని సెక్యులర్ వాదులు అండగా ఉంటారు.
సద్దామ్ పెద్దార్:
షోపియాన్ జిల్లా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్. జిల్లాలో ఉగ్రవాదం, జీహాద్‌వైపు ముస్లిం యువతను ఆకర్షించి.. వారిని రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అలాగే ఆయుధాల సరఫరా చేస్తుంటాడు. గతంలో బుర్హాన్ వనీ గ్రూప్‌లో కీలకంగా పనిచేశాడు.
జీనత్ ఉల్ ఇస్లామ్
షోపియాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల జీనత్ లష్కరే తోయిబా టాప్ కమాండర్‌గా పనిచేస్తాడు. షోపియాన్ జవాన్లపై జరిగిన దాడికి వ్యూహరచన చేసింది జీనత్ ఇస్లామే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు.
ఖలీద్ :
పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్.. జైషే మహమ్మద్ డివిజనల్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. 2016 నుంచి ఉత్తర కశ్మీర్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. మిలిటెంట్లను నియంత్రణ రేఖ దాటించడం, ఆయుధాలు, దాడులకు వ్యూహరచన చేయడం చేస్తాడు. ఇతనిపై భద్రతా బలగాలు ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేశాయి.