శ్రీనగర్: ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమయ్యాడు. ఇతడు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కశ్మీర్లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు. నైకూ పోలీసుల నుంచి ఇప్పటికే మూడుసార్లు తప్పించుకున్నాడు. అయితే ఈసారి తప్పించుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అతన్ని హతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆపరేషన్ సాగిందిలా..
నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు.
ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. షర్షాలి అనే మరోగ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు ఎవరో గుర్తించాల్సి ఉంది. కశ్మీర్ వాలీలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సెల్‌ఫోన్ టవర్లను మూసేసినట్లు తెలిపారు.
నైకూ చరిత్ర ఇది..
మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. నైకూ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అతడి మరణం మరికొందరు చేసే అల్లర్లకు, నిరసనలకు కారణంగా మారేందుకు అంగీకరించరాదని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment