zakir musa
-
కశ్మీర్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రసంస్థ అల్‌కాయితో సంబంధాలున్న గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్ చీఫ్ జకీర్ ముసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘చనిపోయిన ఉగ్రవాదిని జకీర్ ముసాగా గుర్తించాం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నాం’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా వెల్లడించారు. తొలుత దాద్‌సారా గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అదే సమయంలో అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు వివరించారు. అతడిని పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా వినలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, షోపియాన్, పుల్వామా, అవంతీపురా, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జకీర్‌కు మద్దతుగా ప్రజలు ఆందోళనలు చేపట్టారని, నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో అధికారులు లోయలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. ముసా 2013 నుంచి ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. తొలుత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఏర్పరచుకున్నాడని, ఆ తర్వాత అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 2017లో హురియత్ కాన్ఫరెన్స్ నేతలను బెదిరించినట్లు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు అల్‌కాయిదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వతుల్ హింద్(ఏజీయూహెచ్)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో చనిపోయినవారిలో ఏజీయూహెచ్ అధినేత జకీర్ ముసా సన్నిహితుడు, సంస్థ డిప్యూటీ చీఫ్ సొలిహా మొహమ్మద్ అఖూన్ ఉన్నాడు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ పోలీస్ ఐజీ స్వయంప్రకాశ్ పానీ మీడియాతో మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో నక్కినట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఇక్కడి ఆరంపొరా అనే గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. ఇంతలోనే భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఏజీయూహెచ్ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సోలిహా మొహమ్మద్, ఫైజల్ అహ్మద్, నదీమ్ సోఫీ, రసీక్ మిర్, రౌఫ్ మిర్, ఉమర్ రమ్జాన్‌గా గుర్తించాం. మృతుల్లో ఏజీయూహెచ్‌లో నంబర్ 2గా ఉన్న సోలిహా మొహమ్మద్ ఉన్నాడు. ఈ ఎన్కౌంటర్లో జవాన్లు ఎవరూ గాయపడలేదు’ అని తెలిపారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
కశ్మీర్లో ఆత్మాహుతి దాడి : ఐబీ హెచ్చరికలు
శ్రీనగర్ : ఉగ్రవాద సంస్థ అన్సార్ గజ్వాత్ ఉల్- హింద్ చీఫ్ జకీర్ మూసా కశ్మీర్లో ఆత్మాహుతి దాడులు జరిపించేందుకు పథకం రచిస్తున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్ పోలీసులే లక్ష్యంగా దాడులకు తెగబడనున్నట్లు పేర్కొన్నాయి. తన అనుచరుడు రేహాన్‌తో కలిసి దాడులు నిర్వహించేందుకు కశ్మీర్ యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం అందినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కల్లోలం సృష్టించేందుకు జకీర్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్న ఐబీ.. పోలీసు స్టేషన్లు, భద్రతా బలగాల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇందుకోసం ఇప్పటికే కశ్మీర్లోకి కొంత మంది జీహాదీలు చొరబడినట్లు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. -
కశ్మీర్లో విధ్వంసానికి పాక్ కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో భారీ విధ్వంసానికి ఆల్‌ఖైదా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలు కుట్రలు చేస్తున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆల్‌ఖైదా కమాండర్ జాకీర్ ముసా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి లోయలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని అంతర్గత నిఘా సంస్థలు తెలిపాయి. జాకీర్ముసా, మరికొందరు హిజ్బుల్ ఉగ్రవాదులు కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాకీర్ ముసా, మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్టోబర్ 26న పుల్వామాలోని ఒక రహస్య ప్రాంతంలో సమావేశమయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక విధ్వంసం కోసం కొత్తగా శిక్షణ తీసుకున్న 12 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ నియంత్రణ రేఖ గుండా భారత్‌లోకి ప్రవేశపెట్టిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం 14 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా దాక్కున్నారని.. వీరు ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే ప్రమాదముందని నిఘావర్గాలు చెబుతున్నారు. -
నెక్ట్స్ టార్గెట్.. వీళ్లే..!?
సాక్షి, కశ్మీర్ : కొంత కాలంగా కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు చాలా దూకుడు మీదున్నాయి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు.. నియంత్రణ రేఖ దాటుతున్న మిలిటెంట్లను ఎక్కడిక్కడ భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. తాజాగా అమర్నాథ్ యాత్రీకులపై దాడికి వ్యూహరచన చేసిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్‌ను రెండు రోజుల కిందట శ్రీనగర్‌లో భద్రతా బలగాలు కాల్చి చంపాయి. తాజాగా.. జమ్మూ కశ్మీర్లో హింసను ప్రోత్సహిస్తున్న టాప్-5 మిలిటెంట్ల జాబితాను భద్రతా బలగాలు విడుదల చేశాయి. మా నెక్ట్స్ టార్గెట్ వీళ్లేనంటూ చెప్పకనే చెప్పాయి. జాకిర్ ముసా : కశ్మీర్ లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకిర్ ముసా. ఇతను ఆల్‌ఖైదా కశ్మీర్ విభాగానికి అధిపతి. మొదట్లో హిజ్బుల్ ముజాహిదిన్‌లో పనిచేశాడు. ఇతన్ని ఎన్కౌంటర్ చేస్తే.. టెర్రరిస్టుల రిక్రూట్మెంట్లు తగ్గుతాయని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. రియజ్ నాయికొ: రియాజ్ ప్రస్తుతం హిజ్బుల్ ముజాహిదీన్ కొత్త చీఫ్. భద్రతా బలగాలు, సరిహద్దు సైనికులు ఇతని కోసం డేగ కళ్లతో చాలా కాలంగా వెతుకుతున్నాయి. హిజ్బుల్ టెర్రరిస్టులను ఆపరేట్ చేస్తూ.. లోయలో ఎక్కడెక్కడ అల్లర్లు చేయాలో డిసైడ్ చేస్తుంటాడు. ఇతనికి లోయలోని సెక్యులర్ వాదులు అండగా ఉంటారు. సద్దామ్ పెద్దార్: షోపియాన్ జిల్లా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్. జిల్లాలో ఉగ్రవాదం, జీహాద్వైపు ముస్లిం యువతను ఆకర్షించి.. వారిని రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అలాగే ఆయుధాల సరఫరా చేస్తుంటాడు. గతంలో బుర్హాన్ వనీ గ్రూప్‌లో కీలకంగా పనిచేశాడు. జీనత్ ఉల్ ఇస్లామ్ షోపియాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల జీనత్ లష్కరే తోయిబా టాప్ కమాండర్‌గా పనిచేస్తాడు. షోపియాన్ జవాన్లపై జరిగిన దాడికి వ్యూహరచన చేసింది జీనత్ ఇస్లామే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఖలీద్ : పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్.. జైషే మహమ్మద్ డివిజనల్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. 2016 నుంచి ఉత్తర కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. మిలిటెంట్లను నియంత్రణ రేఖ దాటించడం, ఆయుధాలు, దాడులకు వ్యూహరచన చేయడం చేస్తాడు. ఇతనిపై భద్రతా బలగాలు ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేశాయి. -
‘తలలు నరికి వేలాడదీస్తా..’
శ్రీనగర్: తమ ఉద్యమానికి అడ్డొస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడాదీస్తానంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్‌కు చెందిన నాయకులను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది జాకీర్ మూసా ఒక సంచలన ఆడియోను విడుదల చేశాడు. ఇస్లాం స్థాపనకోసం తామెంతో పోరాడుతున్నామని, దీనికి అడ్డంకులు సృష్టిస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని, వారు హుర్రియత్ నాయకులైనా తలలు నరికిపడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఆడియోను ముజఫరా బాద్ నుంచి విడుదల చేశాడు. అయితే, ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హిజ్బుల్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. మూసా ప్రకటనకు తమ ఉద్యమానికి సంబంధం లేదని, అది అతడి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. ముసా ఇచ్చిన ప్రకటనకు తమకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న హుర్రియత్ నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా ఇతర ఉగ్రవాద సంస్థలకు కశ్మీర్లో ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మరోపక్క హిజ్బుల్ సంస్థ అధికారిక ప్రతినిధి సలీం హష్మీ స్పందిస్తూ గందరగోళం సృష్టించే ఏ ప్రకటన ఉన్నా అది పోరాటాన్ని దెబ్బతీస్తుందని, ముసా ప్రకటనకు తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. హిజ్బుల్ సంస్థ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండి ఉగ్రవాద చర్యలకు దిగుతోంది. మరోపక్క, పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆడియో టేపును పరిశీలించే పనిలో పడ్డారు. ఇదిలాఉండగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ముసా ప్రకటించాడు. అయితే, అతడిని తమతో కొనసాగించుకునేందుకు హిజ్బుల్ సంస్థ నిరాకరించడంతో అతడు వేరే ప్రత్యామ్నాయం లేక సంస్థను వదిలేశాడు.