‘తలలు నరికి వేలాడదీస్తా..’
శ్రీనగర్: తమ ఉద్యమానికి అడ్డొస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడాదీస్తానంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్‌కు చెందిన నాయకులను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది జాకీర్ మూసా ఒక సంచలన ఆడియోను విడుదల చేశాడు. ఇస్లాం స్థాపనకోసం తామెంతో పోరాడుతున్నామని, దీనికి అడ్డంకులు సృష్టిస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని, వారు హుర్రియత్ నాయకులైనా తలలు నరికిపడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఆడియోను ముజఫరా బాద్ నుంచి విడుదల చేశాడు. అయితే, ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హిజ్బుల్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు.
మూసా ప్రకటనకు తమ ఉద్యమానికి సంబంధం లేదని, అది అతడి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. ముసా ఇచ్చిన ప్రకటనకు తమకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న హుర్రియత్ నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా ఇతర ఉగ్రవాద సంస్థలకు కశ్మీర్‌లో ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
మరోపక్క హిజ్బుల్ సంస్థ అధికారిక ప్రతినిధి సలీం హష్మీ స్పందిస్తూ గందరగోళం సృష్టించే ఏ ప్రకటన ఉన్నా అది పోరాటాన్ని దెబ్బతీస్తుందని, ముసా ప్రకటనకు తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. హిజ్బుల్ సంస్థ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండి ఉగ్రవాద చర్యలకు దిగుతోంది. మరోపక్క, పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆడియో టేపును పరిశీలించే పనిలో పడ్డారు. ఇదిలాఉండగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ముసా ప్రకటించాడు. అయితే, అతడిని తమతో కొనసాగించుకునేందుకు హిజ్బుల్ సంస్థ నిరాకరించడంతో అతడు వేరే ప్రత్యామ్నాయం లేక సంస్థను వదిలేశాడు.