శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు శనివారం ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్‌లు ఉన్నారని పేర్కొన్నారు.
తొలగించిన వారిలో పోలీస్, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. వీరిలో నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్‌కు చెందిన వారు కాగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు.
రెండు సమావేశాల్లో..
కశ్మీర్‌కు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఇటీవల రెండు సార్లు సమావేశమైందని అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటి సమావేశంలో ముగ్గురిని, రెండో సమావేశంలో 8 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని ఆరోపిం చారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు.
11 మంది ‘ఉగ్ర’ ఉద్యోగుల తొలగింపు
Published Sun, Jul 11 2021 3:14 AM | Last Updated on Sun, Jul 11 2021 3:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment