అన్సారీపై ఆర్‌ఎస్‌ఎస్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలు అభద్రతలో ఉన్నారని ఉపరాష్ట్రపతిగా వైదొలుగతూ హమిద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత అన్సారీపై విరుచుకుపడ్డారు. ఆయన తనకు ఎక్కడ పూర్తి స్వేచ్ఛ, భద్రత ఉందని భావిస్తారో ఆ దేశానికి వెళ్లవచ్చని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు.
అన్సారీ సహా ముస్లింలు భారత్‌లో అభద్రతా భావంతో ఉన్నారని భావిస్తున్నవారంతా ముస్లింలు సురక్షితంగా ఉన్న దేశం పేరు వెల్లడించి, నిరభ్యంతరంగా అక్కడికి వెళ్లవచ్చని కుమార్ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని, ముస్లింలు సైతం ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారని చెప్పారు. పదేళ్లుగా లౌకిక వాదిగా ఉన్న హమీద్ అన్సారీ పదవీ విరమణ చేయగానే కుహనా లౌకికవాదిగా మారారని విస్మయం వ్యక్తం చేశారు.