మనసు పెట్టి పనిచేయాలి. వర్తమానంలో జీవించాలి. జీవితాస్వాదనకు మార్గమదే. జీవించడమంటే అదే. అలనాటి యోగుల నుంచి నేటి పరిశోధకుల వరకు చెబుతున్నదిదే. కానీ మనసు అట్టే మాట వినదు.. ఏకాగ్రత కుదరదు.. కాబట్టి అలాంటి జీవన విధానాన్ని అవలంభించడం తమ వల్ల కానేకాదంటుంటారు చాలామంది. అది కష్టమైనప్పటికీ, సాధనతో సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. దాన్నే ‘మైండ్‌ఫుల్‌నెస్’ అంటున్నారు. అంటే చేసే పనిపై పూర్తిగా మనసు పెట్టడమన్నమాట.
తినడం.. నడవడం.. తోమడం.. కడగడం.. ఊడ్వడం.. చదవడం.. వినడం.. ఇలా పనేదైనా సరే దానిపై సంపూర్ణంగా మనసు పెట్టండి. ఆస్వాదించండి. అప్పుడు అదీ ఓ ధ్యానమే అవుతుంది అంటు న్నారు మైండ్‌ఫుల్‌నెస్ నిపుణులు. బౌద్ధ ‘ధ్యానం’నుంచి ఉద్భవించిన ఈ విధానానికి అదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పద్ధతుల్ని సాధన చేసే వారు పెరుగుతున్నారు. దీని వల్ల మానసిక ఒత్తిడి, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నుంచి బయటపడవచ్చునని, ఏకాగ్రతను పెంచుకోవడంతో సహా పలు విధాలుగా జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చునని సాధకుల అనుభవాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్యలు పరిష్కరించగల మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత థెరపీలూ అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్నాయి. మైండ్‌ఫుల్‌నెస్ యాప్‌ల వాడకమూ పెరిగింది. జీవితానికి హాని చేసే/ఇబ్బంది పెట్టే ఆలోచనలను ఎదుర్కొనేందుకు, మనిషి తన పట్ల తాను దయగా వుండేందుకు, ప్రశాంతంగా వుండేందుకు మైండ్‌ఫుల్‌నెస్ సాయపడగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యక్తిత్వ వికాస నిపుణుల బోధనల్లోనూ సంబంధిత అంశాలు భాగమవుతున్నాయి. అమెరికాకు చెందిన ఎత్నా ఇంటర్నేషనల్ అనే ఆరోగ్య బీమా సంస్థ – 13000 మందికి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు నేర్పించింది. వారిలో ఒత్తిళ్ల స్థాయి 28 శాతం మేరకు తగ్గడాన్ని గుర్తించింది. వార్షిక ఉత్పాదకత కూడా మెరుగుపడిందని, తలసరి ఉత్పాదకత 3,000 డాలర్ల మేరకు పెరిగిందని అంచనా వేసింది.
వర్తమానంలోకి..
హృదయ స్పందనల వెనుక, కార్యాచరణ వెనుక వుండేది మనుషుల ఆలోచనా విధానమే. ఒక్కోసారి వారు గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలు, బాధాకర అనుభవాలు పదే పదే తలచుకుని వేదనను లోనవుతుంటారు. భవిష్యత్తు గురించిన రకరకాల ఊహలతో భయపడిపోతుంటారు. మొత్తంగా గతంలోనో, భవిష్యత్తులోనో తరచూ సంచరిస్తుంటారు. రకరకాల పద్ధతుల ద్వారా వారి ఆలోచనల్ని వర్తమానంలోకి తీసుకురావడానికి మైండ్‌ఫుల్‌నెస్ దోహదపడుతుం దని బోధకులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో చేసే పని మనసును శుద్ధి చేస్తుందంటున్నారు జపాన్ బౌద్ధ సన్యాసి షౌకి మట్సుమొటొ. గత సంవత్సరం వెలువడిన ఆయన పుస్తకం∙‘ఏ మాంక్స్ గైడ్ టు ఎ క్లీన్ హౌస్ అండ్ మైండ్’ ఆ దేశంలో ఎంతోమంది జీవనశైలిని ప్రభావితం చేసింది. మనసు పెట్టి పరిశుభ్రం చేసే పని హృదయాన్ని శుద్ధి చేస్తుందంటారాయన.
పాఠ్యాంశంగా..
ఇంగ్లాండ్‌లోని 370 పాఠశాలల్లో మైండ్‌ఫుల్‌నెస్ క్లాసులు జరగబోతున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి. విశ్రాంతి తీసుకునే పద్ధతులు, శ్వాస సంబంధిత వ్యాయామాలు, భావోద్వేగాలు అదుపు చేసుకునేందుకు సాయపడే విధానాల గురించి 2021 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రపంచంలో భారీ ఎత్తున జరుగుతున్న మైండ్‌ఫుల్‌నెస్ శిక్షణ కార్యక్రమాల్లో ఇదొకటని నిర్వాహకులు చెబుతున్నారు. ‘మానసిక ఆరోగ్యం విషయంలో గోప్యతను విడనాడాలి. మానసిక ఆరోగ్యంతో, శ్రేయస్సుతో, ఆనందంతో ముడివడిన విషయాల్ని పిల్లలకు క్రమంగా పరిచయం చేయాలి’ అంటున్నారు బ్రిటీష్∙ఎడ్యుకేషన్ సెక్రటరీ డమియన్ హిండ్స్.
శిక్షణ వెనుక..
ఇంగ్లాండ్‌లో 5–19 వయోశ్రేణికి చెందిన ప్రతి 8 మంది పిల్లల్లో ఒకరు మానసిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు 2017లో జరిగిన నేషనల్ హెల్త్ సర్వీస్ సర్వే వెల్లడించింది. 5– 15 ఏళ్ల పిల్లల్లో మానసిక సమస్యలున్న వారు 1999 (9.7 శాతం)తో పోల్చుకుంటే 2017 (11.2 శాతం)లో పెరిగారు. దీన్ని ‘పిల్లల మానసిక ఆరోగ్య సంక్షోభం’గా వ్యాఖ్యానిస్తున్న నిపుణులు– ఇందుకు కారణమవుతున్న ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, వేధింపులు, సోషల్ మీడియా వైపు వేలెత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యమే ప్రభుత్వాన్ని శిక్షణకు ప్రేరేపించింది. కేంబ్రిడ్జ్, బకింగ్‌హామ్, అబెరిష్వెత్ తదితర వర్సిటీలు కూడా ఈ శిక్షణపై దృష్టి పెట్టాయి. ఎక్స్‌టర్ వర్సిటీ దశాబ్ద కాలంగా మైండ్‌ఫుల్‌నెస్‌పై పీజీ ట్రైనింగ్ కోర్సులు నిర్వహిస్తోంది. వార్విక్, ఇడెన్‌బర్గ్, బంగోర్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల్లోనూ దీనిపై కోర్సులు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా వర్సిటీల్లో ఇదొక పాఠ్యాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment