ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగించడంతో రైల్వేశాఖకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టిక్కెట్లను ముందుగానే తీసుకున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 3 మధ్య కాలానికి 39 లక్షల టికెట్లు రద్దు చేసుకునే అవకాశముందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14కు ముగుస్తుందన్న ఉద్దేశంతో 15 నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అడ్వాన్స్ టిక్కెట్లు తీసుకున్నారు.
లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయిన వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించడంతో మే 3 వరకు పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. అలాగే టిక్కెట్ కౌంటర్లను ముసివేస్తున్నామని, అడ్వాన్స్ ఆన్‌లైన్ రిజర్వేషన్‌ను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రద్దైన టిక్కెట్లను పూర్తి మొత్తం రిఫండ్ చేస్తామని వెల్లడించింది. సరకు రవాణా చేసే గూడ్స్, పార్శిల్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని తెలిపింది. కాగా, లాక్‌డౌన్‌తో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయిన రైల్వేశాఖ.. భారీ సంఖ్యలో టిక్కెట్ల రద్దుతో మరింత ఆదాయం నష్టపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment