న్యూఢిల్లీ: కరోనా కట్టికి అమలు చేస్తున్న లాక్‌డౌన్ సమయంలో విధించిన ఆంక్షలను పట్టించుకోని యజమానులకే జరిమానాలు విధిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలకు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులను దుర్వినియోగం చేయడంతోపాటు ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఆయా సంస్థల యాజమాన్యాలకే జరిమానాలు విధిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరించింది. ఎవరైనా ఉద్యోగి కోవిడ్–19 పాజిటివ్ అని తేలితే సంబంధిత కంపెనీల డైరెక్టర్లు, యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు హోం శాఖ ఆదేశాలిచ్చిందంటూ మీడియాలో వస్తున్నవన్నీ అబద్ధాలని తెలిపింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్–2015 చట్టం కింద యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నాయని ట్విటర్‌లో స్పష్టంగా పేర్కొంది.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ గడువును మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో కేంద్రం గురువారం కొన్ని సడలింపులు ప్రకటించింది. స్టేషనరీ, మొబైల్ రీచార్జ్, నిర్మాణ రంగానికి అవసరమైన వస్తువులు అమ్మే దుకాణాలు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. పిండి మిల్లులకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment