న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేందుకు వీలు కల్పించే కీలకమైన క్రిమినల్ లా (సవరణ) బిల్లు–2018ను బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ 21 తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు.
కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ బిల్లులో 12, 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలుండేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ‘12 ఏళ్లలోపు బాలికలపై రేప్‌నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్‌రేప్ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష’ అమలవుతుంది’ అని చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
మూకహత్యల దోషులకు మరణ శిక్ష: మంత్రి
మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment