
ఆలస్యం చేస్తే క్షమించరు...
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై లోక్సభలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గళాన్ని గట్టిగా వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆపార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఈ అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని కోరారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిన మేకపాటి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, అప్పటి ప్రధాని లోక్ సభలో ఇచ్చిన హామీని, ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ వాగ్దానాన్ని అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్కు లోటు బడ్జెట్ ఉందని, కనీసం రాజధాని కూడా లేదని ఎంపీ మేకపాటి సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రాన్ని మళ్లీ జీరో నుంచి నిర్మించాల్సి ఉందని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, ఆలస్యం చేస్తే క్షమించరని మేకపాటి పేర్కొన్నారు.