సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 టెస్టింగ్‌కు రోగుల్లో కనిపించే లక్షణాల జాబితాలో మరో రెండింటిని చేర్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షల మార్క్‌కు చేరువైన క్రమంలో ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనూహ్యంగా రుచి కోల్పోవడం, వాసనను పసిగట్టలేకపోవడం పలు కరోనా రోగుల్లో కనిపిస్తున్నందున వీటినీ కరోనా లక్షణాల్లో చేర్చాలని గతవారం కోవిడ్-19పై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చర్చకు వచ్చినా ఇంకా దీనిపై ఏకాభిప్రాయం వెల్లడికాలేదు. కోవిడ్-19 టెస్టింగ్‌కు అర్హమైన లక్షణాల జాబితాలో వీటిని చేర్చాలని కొందరు సభ్యులు సూచించగా దీనిపై చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఫ్లూ ఇతర ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడేవారిలోనూ ఇలాంటి లక్షణాలు ఉంటాయని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం (సీడీసీ) కోవిడ్-19 లక్షణాల జాబితాలో వాసన, రుచి కోల్పోవడాన్ని గతవారం చేర్చింది. మే 18న ఐసీఎంఆర్ జారీ చేసిన సవరించిన టెస్టింగ్ విధానాల్లో వైరస్ లక్షణాలతో బాధపడే వలస కూలీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. వైరస్ లక్షణాలు కలిగిన ఆస్పత్రల్లోని రోగులందరికీ, కంటైన్మెంట్ జోన్లలో పనిచేసే ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. నిర్ధారిత వైరస్ కేసుతో నేరుగా సంబంధం కలిగిన హైరిస్క్ కాంటాక్టులందరికీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment