
ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ. కోట్లు ఓడి.. ఆత్మహత్య
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులో కోట్లాది రూపాయలు ఓడిపోవడంతో.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా దేశ రాజధానిలోని పార్లమెంటు ఎదురుగా!! పార్లమెంట్ పార్కింగ్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు తెలిపారు. మృతుడు మధ్యప్రదేశ్ లోని శివపూర్‌కు చెందిన రామ్ దయాళ్ వర్మ(39)గా పోలీసులు గుర్తించారు. మృతుడి జేబులోని 23 పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడు గురువారం ఉదయమే ఢిల్లీకి వచ్చి, నేరుగా విజయ్‌చౌక్ వద్దకు వెళ్లి, అక్కడ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆ చెట్టుపక్కనే ఒక బ్యాగులో ఉన్న పలు పత్రాలు, రైల్వే టికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాను ఐపీఎల్, ఇతర క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్ వేసి కోట్లాది రూపాయలు నష్టపోయానని, బెట్టింగ్ వేయడం కోసం చాలా మంది దగ్గర అప్పులు చేశానని అతడు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఇక చావుతప్ప వేరే మార్గం లేదని ఇక్కడికొచ్చినట్లు అందులో రాశాడు. ఓ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. రైల్లోనే 23 పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంటాడని పోలీసులు తెలిపారు. అతడి భార్యకు కూడా ఇతడి బెట్టింగుల గురించి తెలుసని, తాము ఫోన్ చేయగానే అతడిని అరెస్టు చేశారా అని ఆమె ప్రశ్నించారని అన్నారు.