సాక్షి, ముంబై : శివారు ప్రాంతమైన విరార్‌లో అదనంగా మరో 2,500 ఇళ్లు నిర్మించేందుకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) రంగం సిద్ధం చేసింది. ఇక ముంబైకర్లకు చౌక ధరలకే మరిన్ని ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విరార్‌లోని బోలింజ్ ప్రాంతంలో కొంకణ్ మండలి ఆధ్వర్యంలో రెండు విడతల్లో మంజూరైన 6,290 ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తికాకముందే మూడో విడత ఇళ్లు నిర్మించేందుకు మాడా ఏర్పాట్లు చేస్తోంది. 2,500 ఇళ్లు నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది.
తొలగిన వివాదం
ఎట్టకేలకు రిజర్వేషన్ వివాదం తొలగిపోయింది. ఈ వివాదంలో చిక్కుకున్న సుమారు మూడున్నర హెక్టార్ల స్థలం మాడాకు లభించింది. ఇక్కడ మరిన్ని ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. విరార్-బోలింజ్ ప్రాంతంలో మాడాకు దాదాపు 47 హెక్టార్ల సొంత స్థలాలున్నాయి. అందులో వసయి-విరార్ కార్పొరేషన్ ఏకంగా 22 హెక్టార్ల స్థలాలు వివిధ రకాల రిజర్వేషన్‌లకు కేటాయించింది.
మిగతా 25 హెక్టార్లలో 11 హెక్టార్ల స్థలాలను ఇటీవల విక్రయానికి పెట్టింది. ఇక మిగిలిన 14 హెక్టార్లలో ఏడు హెక్టార్ల స్థలంలో రెండు దశల్లో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ పనులు కొసాగుతున్నాయి. మిగతా ఏడు హెక్టార్లలో మూడున్నర హెక్టార్ల స్థలం రిజర్వేషన్ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు పరిష్కారం కావడంతో అదనంగా మరో రెండున్నర వేల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మాడా నిర్ణయించింది.
22 హెక్టార్ల స్థలాన్ని మాడాకు అప్పగించాలి
వసయి-విరార్ కార్పొరేషన్ వివిధ రకాలకు కేటాయించిన 22 హెక్టార్ల స్థలాన్నీ మాడాకు అప్పగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు కొంకణ్ మండలి నూతన సభాపతి మాణిక్‌రావ్ జగ్తాప్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో మాడా స్థలాలను వసయి-విరార్ కార్పొరేషన్ రిజర్వేషన్ చేయడం సబబు కాదన్నారు. కనీసం 50 శాతం స్థలాలను తిరిగి మాడాకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఆ స్థలం కూడా మాడా ఆధీనంలోకి వస్తే బోలింజ్ ప్రాంతంలో భవిష్యత్‌లో పేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి వీలు పడనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు తొమ్మిది వేల ఇళ్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
ధారావిలో పూర్తికావచ్చిన బహుళ అంతస్తుల భవనం
సాక్షి, ముంబై : ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన ‘ధారావి’లో నిర్మించిన మొదటి బహుళ అంతస్తుల భవనం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జోపడ్‌పట్టి పునరావసం (జోపు) పథకం ద్వారా చేపట్టిన ఈ భవనం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. శాసన సభ ఎన్నికల ప్రవర్తన నియమావలి (కోడ్) అమలులోకి రాకముందే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేతుల మీదుగా అర్హులైన పేదలకు ఇళ్లు అప్పగించేందుకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా), రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఐదు సెక్టార్లుగా ధారావి విభజన
ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ పేరు గాంచిన ఈ ధారావి ప్రాంతంలో వేలాది గుడిసెలు, చిన్న చితికా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. కొన్ని హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక్కసారి పునరాభివృద్ధి చేయడం సాధ్యం కాదని అప్పట్లో తేలిపోయింది. ఈ ప్రాంతాన్ని మొత్తం ఐదు సెక్టార్లుగా విభజించారు. అయినప్పటికీ వివిధ ఆటంకాల కారణంగా తొమ్మిది సంవత్సరాల నుంచి ధారావి జోపడ్‌పట్టి పునరాభివృద్థి పథకం అమలుకు నోచుకోలేకపోయింది. చివరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించి ప్రైవేటు బిల్డర్ల ద్వారా ఈ పథకాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడసి కొట్టింది.
ఐదో నెంబర్ సెక్టార్‌లో..
దీంతో కేవలం ఐదో నెంబర్ సెక్టార్‌ను మాడాకు అప్పగించి ఈ ప్రాజెక్టును ముందు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రకారం ధారావి బస్ డిపో సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో మొదటి బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు బి.జి.శిర్కే కన్‌స్ట్రక్షన్‌కు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆ భవనం తుది మెరుగులు దిద్దుకొని ఓసీ కోసం వేచి చూస్తోంది. ఈ వారం, పది రోజుల్లో ఓసీ లభించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత అర్హులకు ఇళ్ల తాళాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేస్తారు. రెండు వారాల తరువాత ఎప్పుడైననా కోడ్ అమలులోకి వచ్చే సూచనలు ఉన్నాయి. అంతలోపే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు. అందుకు అర్హులైన 170 మంది పేదలను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు.
ఈ భవనంలో సౌకర్యాలు..........
పార్కింగ్ సౌకర్యంతోపాటు మొత్తం 18 అంతస్తుల భవనం .
{పతీ అంతస్తులో 21 ఫ్లాట్లు
ఒక్కో ఫ్లాట్‌కు సుమారు రూ.13.50లక్షలు ఖర్చు
300 చ.ట. కార్పెట్ ఏరియా. (556 చ.ట. సూపర్ బిల్ట్ అప్)
మూడోవిడతలో మరో 2,500 ఇళ్లు
Published Mon, Aug 18 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement