
ముంబై: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను 2019 లోక్‌సభ ఎన్నికలలో పుణే నుంచి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. జూన్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాధురీని ఆమె నివాసంలో కలిసి ఈ మేరకు చర్చలు జరిపినట్లు, ప్రధాని మోదీ సాధించిన విజయాలను ఆమెకు వివరించినట్లు పార్టీ రాష్ట్ర సీనియర్ నేత ఒకరు తెలిపారు. పుణే స్థానానికి ఆమె పేరు పరిశీలిస్తున్నామని, ఆ స్థానం నుంచి పోటీచేయడానికి ఆమే సరైన వ్యక్తి అని గురువారం ఆయన తెలిపారు.
2014 లోక్‌సభ ఎన్నికలలో పుణే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి అనిల్ షిరోలే మూడు లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, ‘గుజరాత్‌లో నరేంద్ర మోదీ ఈ ప్రణాళికతో విజయవంతమయ్యారు. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్తవారిని పోటీ చేయించడం ద్వారా ఆయన మంచి ఫలితాలు సాధించారు. కొత్తగా పోటీచేసే వారిని విమర్శించడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. దీనివల్ల ప్రతిపక్షం తికమక పడడంతో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకోగలిగింది’అని ఆయన వివరించారు.