తప్పించుకున్న మావో అగ్రనేత?
హైదరాబాద్/చర్ల, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో సోమవారం మధ్యాహ్నం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకుని పోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత ఒకరు ఉండి ఉండవచ్చని ఇంటెలిజెన్స్ పోలీసులు సందేహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో... ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో, బీజాపూర్ జిల్లా భద్రకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెందూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య అరగంట పాటు ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు తప్పించుకుపోయారు. వీరు 30 మందికిపైగా ఉం టారని భావిస్తున్నారు. వారి కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలయ్యాయని, ఒకరిద్దరు మృతి చెంది ఉంటారని భావిస్తున్ననప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేకేడబ్ల్యూ కొత్తగూడెం, నర్సంపేట ఏరియా కమిటీల నక్సల్స్ పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
తప్పించుకున్నది మల్లోజులేనా?: తప్పించుకున్న మావోయిస్టుల్లో కేంద్ర కమిటి సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లేదా రాష్ట్రానికి చెందిన మరో అగ్రనేత ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు సందేహిస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం ఖమ్మం జిల్లాకు సమీపంలోనే ఉండడంతో జిల్లాలోని వెంకటాపురం పోలీస్ సర్కిల్‌లో అన్ని పోలీస్ స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది.
ఒడిశాలో ఇద్దరు మావోయిస్టులు హతం
కొరాపుట్, మల్కన్‌గిరి, న్యూస్‌లైన్: ఒడిశాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోలు మృతి చెందారు. కోరాపుట్ జిల్లా నారాయణపట్నం అటవీ ప్రాంతంలో మావోలు, జిల్లా స్వచ్ఛంద దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పూర్ణ హులుక అనే మావోయిస్టు మృతి చెందారు. నువాపడ జిల్లాలోని సునాబెడ అడవిలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది.
ఛత్తీస్ , మహారాష్ట్ర సరిహద్దులో ఎదురు కాల్పులు
Published Tue, Apr 15 2014 2:18 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement