రక్తం అమ్మి డబ్బు కట్టబోయారు
భోపాల్: ప్రభుత్వ హాస్టళ్ల వార్డెన్లు జలగల్లా విద్యార్థుల రక్తం తాగుతున్నారనడానికి మరో నిజం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్ధినిలు ఇద్దరు స్ధానిక ఆసుపత్రి వద్ద కనిపించారు. అక్కడు వచ్చి పోయే వారి వద్దకు వెళ్లి రక్తం అవసరమైతే తాము ఇస్తామని.. అందుకు కొంత డబ్బు కావాలని కోరుతూ గంటల తరబడి అక్కడే ఎదురుచూస్తున్నారు.
ఇది గమనించిన ఓ రిపోర్టర్ వారిని ప్రశ్నించగా హాస్టల్లో నివసించాలంటే డబ్బులు ఇవ్వాలని వార్డెన్ డిమాండ్ చేసినట్లు బాలికలు తెలిపారు. ఘటనను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో గద్దా రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ట్రైబల్ గర్ల్స్ వార్డెన్‌గా పనిచేస్తున్న బైదేహీ ఠాకూర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. దీనిపై మాట్లాడిన మధ్యప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ జైన్ వార్డెన్‌పై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.