
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇంటిలో పెళ్లి, జన్మదినం, వివాహ వార్షికోత్సవం, మరణం... ఒక్క మాటలో చెప్పాలంటే శుభం, అశుభం ఏది జరిగినా ఫ్లెక్సీలతో ఆర్భాటానికి పోతారా. భార్యాభర్తలు విడాకులు తీసుకునేపుడు మినహా అన్ని కార్యాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఇంత వ్యామోహమా’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. మహిళా ఇంజినీర్ శుభశ్రీ దారుణ మరణం రాష్ట్ర ప్రజల హృదయాలను పిండేసింది. ప్రజలు ప్రతిపక్షాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజల ప్రాణాలంటే అధికారులకు అంతచులకనా అంటూ మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా మండిపడింది. చెన్నై క్రోంపేట భవానీనగర్‌కు చెందిన శుభశ్రీ (23) దురైపాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో విధులు ముగించుకుని తన బైక్‌లో ఇంటికి బయలుదేరారు. క్రోంపేట–దురైపాక్కం రేడియల్ రోడ్డు మార్గంలో పల్లికరణైలో ఆమె ప్రయాణిస్తుండగా అన్నాడీఎంకే ప్రముఖుడు జయగోపాల్ కుమారుని వివాహ వేడుక సందర్భంగా దారిపొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలోని ఒకటి తెగి రోడ్డుపై పడడం శుభశ్రీ దానికింద ఇరుక్కోవడం, వెనుకనే వస్తున్న టాంకర్ లారీ ఆమెపై నుంచి వెళ్లి పోయి శుభశ్రీ ప్రాణాలు విడవడం క్షణాల్లో జరిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ట్యాంకర్ లారీ డ్రైవర్ మనోజ్ (25)ను అరెస్ట్‌చేశారు. ప్రమాదం చోటుచేసుకోగానే జయశంకర్ పారిపోగా అతనిపై పోలీసులు కేసుపెట్టారు.
కన్నీరుపెట్టిన రాష్ట్ర ప్రజలు
ఒకరి వివాహ వేడుక మరొకరి ప్రాణాలు తీయడం, శుభశ్రీ ఉజ్వలభవిష్యత్తు టాంకర్ చక్రాల కిందనలిగిపోవడం రాష్ట్ర ప్రజల హృదయాలను కలచివేసింది. ఇదిలా ఉండగా, న్యాయవాదులు లక్ష్మీనారాయణన్, కణ్ణదాసన్...న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయిల ముందు హాజరై ఈ దారుణ ఉదంతాన్ని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా అన్నాడీఎంకే నేత జయశంకర్ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని హరించివేసిందని పేర్కొంటే కేసు నమోదు చేశారు. ప్రజల ఆస్తికి నష్టం కలిగించాడనే సెక్షన్ కింద జయశంకర్‌పై బలహీనమైన కేసును నమోదు చేశారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టాలని వారు కోరారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడంపై ఇప్పటికే పలు ఆదేశాలను జారీచేశామని అన్నారు. అయితే అధికారులు అమలు చేయడం లేదు. మానవ రక్తం పీల్చే జలగల్లా తయారయ్యారు. మద్రాసు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. సచివాలయాన్ని హైకోర్టుకు మార్చాలనే ఆదేశాలు మినహా అన్నిరకాల ఆదేశాలు జారీచేశాం. రాజకీయ నేతల మెప్పు కోసం కార్యకర్తలు కట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు లేదా రూ.3లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారేగానీ ఇలాంటి దయనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం లేదు. పల్లికరణైలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించిన పోలీసు, కార్పొరేషన్ అధికారులు న్యాయస్థానంలో హాజరుకావాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
చదవండి: యువతిని బలిగొన్న బ్యానర్
అన్నాడీఎంకే, డీఎంకే ఆంక్షలు
పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, కార్యక్రమాలకు కట్ అవుట్, బ్యానర్‌లు ఏర్పాటు చేసే పార్టీ నేతలు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ హెచ్చరించారు.
ముగిసిన అంత్యక్రియలు
ప్రమాద వార్త అన్ని మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో శుభశ్రీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరిపోయారు. పోస్టుమార్టం ముగిసిన తరువాత ఇంటికి చేరిన కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. శోకతప్త హృదయాల మధ్య శుక్రవారం సాయంత్రం శుభశ్రీ అంత్యక్రియలు ముగిసాయి. శుభశ్రీ ఫొటోల ముందు క్యాండిళ్లు వెలిగించి పలుచోట్ల ఘనంగా నివాళులర్పించారు. శుభశ్రీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.