శుభశ్రీ మరణం.. నిషేధం అమల్లోకి! | TN Govt To Ban On Flex Boards Banners After HC Order | Sakshi
Sakshi News home page

నిషేధంతో బతుకు ప్రశ్నార్థకం

Published Thu, Sep 19 2019 10:42 AM | Last Updated on Thu, Sep 19 2019 10:44 AM

TN Govt To Ban On Flex Boards Banners After HC Order - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల నిషేధం వ్యవహారం డిజిటల్‌ ప్రింటింగ్‌ రంగంలో ఉన్న వారి బతుకును ప్రశ్నార్థకం చేసింది. ఏడు లక్షల మంది రోడ్డున పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డిజిటల్‌ ప్రింటింగ్‌ రంగాన్ని క్రమబద్ధీకరించి, అనుమతులు ఇచ్చిన చోట మాత్రమే బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు తగ్గ చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో వర్తక సంఘం నేత విక్రమరాజా నేతృత్వంలోని బృందం సీఎం పళనిస్వామిని కలిసి విన్నవించుకున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలను నిషేధించాలని పలు దఫాలుగా హైకోర్టు హెచ్చరించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకున్న వాళ్లే లేరు. ఎక్కడ బడితే అక్కడ ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యక్షం అవుతూనే వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్‌ మీద పడడం, వెనుక వచ్చిన లారీ తొక్కించడం వంటి పరిణామంతో శుభశ్రీ అనే యువతి మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధం అమల్లోకి వచ్చినట్టుగా పరిస్థితి మారింది. అలాగే, డీఎంకే సైతం తాము అనుమతి లేనిదే ఏర్పాటు చేయబోమని స్పష్టం చేస్తూ కోర్టులో ప్రమాణ పత్రం కూడా సమర్పించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న డిజిటల్‌ ప్రింటింగ్‌ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఈ రంగాన్ని నమ్ముకుని ఏడు లక్షల మంది మేరకు ఉన్నారు. వీరందరి పరిస్థితి, ఇక రోడ్డున పడ్డట్టేనా అన్నట్టుగా మారింది. (చదవండి : ఫ్లెక్సీలపై ఇంత వ్యామోహమా ?)

సీఎంతో భేటీ..
డిజిటల్‌ ప్రింటింగ్‌ను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆ అసోషియేషన్లు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం పళని స్వామిని వర్తక సంఘాల నేత విక్రమరాజా నేతృత్వంలో ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఓ వినతి పత్రం అందజేశారు. స్మార్ట్‌ సిటీ పథకం మేరకు దుకాణాల తొలగింపు.. తాజాగా బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం అంశాలను గుర్తు చేస్తూ, డిజిటల్‌ ప్రింటింగ్‌ రంగంలో ఉన్న వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్‌ ప్రింటింగ్‌ను క్రమబద్ధీకరించి, ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని.. అదే విధంగా అనుమతి ఉన్న చోట మాత్రమే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

శుభశ్రీ కుటుంబానికి సాయం..
బ్యానర్‌ రూపంలో విగత జీవిగా మారిన శుభశ్రీ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5లక్షలు సాయం అందజేశారు. స్టాలిన్‌ మాట్లాడుతూ బ్యానర్లు, ఫ్లెక్సీల సంస్కృతికి డీఎంకే వ్యతిరేకమని, అయితే, నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని కట్టడిచేసే విధంగా ముందుకుసాగామని తెలిపారు. ఇక, ఆ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇందుకు తగ్గట్టు తాము కోర్టుకు ప్రమాణపత్రం కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement