
ఉద్యోగి చెంపచెళ్లుమనిపించిన మంత్రి తండ్రి
ముంబై :
మహారాష్ట్ర మంత్రి రంజిత్ పాటిల్ తండ్రి వీఎన్ పాటిల్ ఓ స్కూల్ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపచెళ్లుమనిపించారు. స్కూల్ తనిఖీ చేయడానికి వచ్చానని చెప్పి ఉద్యోగి పైచేయి చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీఎన్ పాటిల్ గతంలో శాసనమండలి సభ్యులుగా కూడా చేశారు. ఈ సంఘటన అకోలా జిల్లాలోని మూర్తిజాపుర్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది.
వీఎన్ పాటిల్‌కు చెందిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ స్కూల్ ఉంది. అదే మండలపరిధిలోని మరో స్కూల్‌లో విద్యార్థులను ఎక్కువగా ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారని స్కూల్ సిబ్బందిపై వీఎన్ పాటిల్ మండిపడ్డట్టు సమాచారం. అదే సమయంలో తనను అసభ్యపదజాలంతో తిడుతూ చేయిచేసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రంజిత్ పాటిల్ చెప్పారు. అయితే తన తండ్రి ఎవరినీ కొట్టలేదని తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటికొస్తాయన్నారు.