
భుజ్/ముంబై: ప్రేమించిన అమ్మాయి కోసం నడుచుకుంటూ పాకిస్తాన్ వెళ్లాలని ప్రయత్నించిన మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని సరిహద్దు భద్రతా బలగాలు అడ్డుకున్న ఘటన గుజరాత్‌లో జరిగింది. అదుపులోకి తీసుకున్నాక అతడిని తల్లిదండ్రులకు బీఎస్‌ఎఫ్ అధికారులు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన జషాన్ మొహమ్మద్ సిద్ధిఖీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
సిద్ధిఖీ సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఈ నెల 11న తన ఇంటి నుంచి బైక్ మీద బయల్దేరి గుజరాత్ చేరుకున్నాడు. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం గుండా పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే మధ్యలో ధోలవీర గ్రామం సమీపంలో బైక్ ఇసుకలో కూరుకుపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి నడక మొ దలుపెట్టాడు.
గ్రామంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న అనుమానాస్పద బైక్ వదిలేసి ఉండటంతో బీఎస్‌ఎఫ్ అప్రమత్తమైంది. ఆ క్రమంలోనే భారత్–పాక్ సరిహద్దు వెంట సిద్ధిఖీని జవాన్లు అడ్డుకున్నారు. అప్పటికే మహారాష్ట్రలో అతని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసును పెట్టారు. అతని బైక్ వివరాలను కేసుతో పోల్చుకున్న పోలీసులు బీఎస్‌ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చి అతన్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అతని సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment