ముంబై : కరోనా మహహ్మారి వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా మహారాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఏడాదిపాటు శాసనసభ్యులందరి జీతంలోంచి 30 శాతం కోత పెట్టాలని గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రెండు సంవత్సరాల పాటు ఎంపీల్యాడ్స్ నిధులను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇక రాష్ర్ట ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ కోసం ఏర్పాటైన రెండు కమిటీలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీల్లో మాజీ అధికారులు, మహారాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సహా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, జయంత్ పాటిల్ ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ర్టలో 24 గంటల్లోనే 72 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కేసుల సంఖ్య 1,135కు చేరింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ముంబై, పూణే, నాసిక్ మరియు నాగ్పూర్ వంటి నగరాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment