పోయివచ్చిరి హస్తినకు..!
ఢిల్లీకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు శనివారం ఢిల్లీకి క్యూకట్టారు. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నందున రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వారంరోజులుగా మీడియాలో అనేకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను మార్చవని, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను కూడా మార్చనున్నారంటూ మీడియా ఊదరగొట్టింది. దీంతో ఈ విషయంపై సీఎం చవాన్ కూడా స్వయంగా స్పందించారు. ఇప్పటిదాకా తనకు ఎటువంటి సమాచారం లేదని, మీడియాలో వస్తున్నవన్నీ కబుర్లేనంటూ కొట్టిపారేశారు.
అయితే మరుసటి రోజు ఉదయమే ఆయన ఢిల్లీ విమానం ఎక్కారు. ఆ వెనుక విమానాల్లో పార్టీలోని కీలక నేతలుగా చెప్పుకుంటున్న నారాయణ్ రాణే, శివాజీరావ్ మోఘే తదితరులు ప్రయాణమయ్యారు. దీంతో మీడియాలో వస్తున్న కథనాలు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారిలో మొదటి నుంచి రాణే పేరు వినిపిస్తోంది. ఆయన ఇటీవల సోనియాతో సమావేశమైనట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇక పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కోసం మోఘే ఫైరవీలు చేస్తున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. దీంతో వీరిద్దరు కూడా విమానం ఎక్కడంతో అధిష్టానం వీరిని పిలిపించిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఇదిలావుండగా అటు ఢిల్లీలో సీన్ మాత్రం మరో ఉన్నట్లు సమాచారం.
ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి చవాన్ బిజీబిజీగా గడిపారు. రాణే, మోఘే ఎవరిని కలిశారన్న సమాచారం అందకపోయినప్పటికీ మీడియా ప్రతినిధులు మాత్రం పూర్తిగా చవాన్‌పైనే దృష్టిపెట్టారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో అధినేత్రి సోనియాతో చవాన్ భేటి అయినట్లు తెలిసింది. అయితే పార్టీ పెద్దలు మాత్రం పార్టీ అంతరంగం ఏమిటనే విషయం నేరుగా చెప్పకుండా రకరకాల లీకులు మీడియాకు విడుదల చేశారు. షిండేకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు వెళ్లాయని కొందరు చెప్పగా నాయకత్వ మార్పుపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించేందుకు మొగ్గుచూపుతోందని మరికొందరు చెప్పారు. దీంతో అసలు విషయం ఏమిటన్నది తేలలేదు.